ఈస్ట్ జెరూసలేం: పేరు తెలిసిన వారికి కరోనా సోకితేనే అయ్యో, పాపం అని సానుభూతి చూపిస్తాం. అదే కుటుంబ సభ్యులకే పాజిటివ్ అని తెలిస్తే ఎప్పుడు ఏమవుతుందోనని భయంతో బతుకుతాం. ఈ భయమే పాలస్తీనాలోని ఓ వ్యక్తిని వెంటాడింది. వెస్ట్ బ్యాంక్‌కు చెందిన జిహాద్ అల్ సువైతీ అనే వ్యక్తి తల్లి రష్మీ సువైతీ(73)కి కరోనా సోకింది. అప్పటి నుంచి అతని మనసు మనసులో లేదు. అమ్మే ప్రాణంగా బతుకుతున్న ఆ వ్యక్తి వెంటనే తల్లిని ఆస్పత్రిలో చేర్పించాడు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె ఎలా ఉందో చూడాలని ఒకటే తహతహలాడిపోయేవాడు. దగ్గరికి వెళ్తే కరోనా సోకుతుందన్న భయం, అమ్మను చూడకుండా ఉండలేని నిస్సహాయత.. వెరసి ఒక ఆలోచన చేశాడు. ఆస్పత్రి గోడెక్కి కిటికీ దగ్గర కూర్చుండి, అక్కడి నుంచి ఆమె తల్లిని కళ్లారా చూసుకునేవాడు. (కరోనా బాధితురాలిని ఇంటికి రానివ్వని అత్త)
ఇలా ప్రతీరోజు జరుగుతూ ఉండేది. ఇంతలో హఠాత్తుగా ఆమె తల్లిని కరోనా కబళించింది. మంగళవారం సాయంత్రం కొడుకును తనివితీరా చూసుకున్న కొద్దిసేపటికే ఆ తల్లి ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్నంతటినీ సామాజిక కార్యకర్త మొహమ్మద్ సఫా సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. తల్లి కోసం తల్లడిల్లిన వ్యక్తి ఫొటోను సైతం పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. "కంట నీళ్లు ఆగడం లేదు", "మాటలు రావడం లేదు, కన్నీళ్లు మాత్రం జలజలా రాలుతున్నాయి", "నిజంగా ఎంత గొప్ప కొడుకు, ఇది చదువుతుంటే నాకు తెలీకుండానే కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి" అంటూ నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. కాగా పాలస్తీనాలో ఇప్పటివరకు మొత్తం 8 వేల కేసులు నమోదవగా 60 మంది మరణించారు. (ఇంకోసారి కనిపిస్తే, దాని పీడ వదిలించుకుంటా)
Comments
Please login to add a commentAdd a comment