జికా, డెంగ్యూలకు దగ్గరి సంబంధం!
లండన్: శిశువు చిన్న తలతో జన్మించడానికి కారణమౌతున్న జికా వైరస్కు వ్యక్సిన్ను కనుగొనే క్రమంలో శాస్త్రవేత్తలు కీలక విషయాన్ని కనుగొన్నారు. గతంలో డెంగ్యూ వైరస్ బారిన పడిన వారిలో జికా వైరస్ ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తోందని బ్రిటన్ పరిశోధకులు గుర్తించారు. ఇటీవల జికా వైరస్ తీవ్రంగా ప్రభావం చూపిన బ్రెజిల్ లాంటి దేశాల్లో.. గతంలో డెంగ్యూ ప్రభావానికి గురైన వారిలో ఈ వ్యాధి విజృంభించిందని గుర్తించారు. డెంగ్యూ వైరస్ను వ్యాప్తి చేసే దోమలే జికా వైరస్ను కూడా వ్యాప్తి చేస్తాయి.
జికా, డెంగ్యూ వ్యాధులను కలిగించే వైరస్లు రెండూ ఒకే ఫ్యామిలీకి చెందినప్పటికీ.. డెంగ్యూ వ్యాధి, జికా అంత ప్రమాదకరమైనది కాదు. అయినప్పటికీ ఈ రెండింటికీ మధ్య సంబంధముందని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. డెంగ్యూ వైరస్కు ఉపయోగించే తరహా వ్యాక్సిన్ జికా వైరస్ను అరికట్టడంతో తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇది కేవలం ప్రాధమిక భావన మాత్రమే అని.. ఇంకా పరిశోధన జరగాల్సి ఉందని వారు వెల్లడించారు.