చైనా గర్ల్‌ని కాక్‌పీట్‌లోకి పిలిచి రెండుగంటలపాటు..
ఇస్లామాబాద్: పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్(పీఐఏ) నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సంఘటనతో మరోసారి వివాదంలోకి వెళ్లింది. పైగా తప్పును ఒప్పుకోకుండా సమర్థించుకునే ప్రయత్నం చేసింది. మొన్నటికి మొన్న ఓ పైలెట్ ఏకంగా 300మందికి పైగా ప్రయాణీకులు ఉన్న విమానాన్ని శిక్షకులకు అప్పగించి గాఢ నిద్రలోకి జారుకోగా తాజాగా షాజద్ అజీజ్ అనే పైలట్ మాత్రం ఏకంగా కాక్‌పీట్‌లోకి ఓ చైనా అమ్మాయిని పిలిపించుకొని కబుర్లు చెప్పుకున్నాడు. ఆ అమ్మాయి ఏకంగా రెండుగంటలపాటు కాక్‌పీట్‌లోనే ఉండి విమానం సరిగ్గా బీజింగ్‌లో ల్యాండ్ అయ్యే సమయంలో బయటకు వచ్చింది.
కాక్‌పీట్‌లో అమ్మాయి ఉండగా అక్కడే కాపలాగా విమానంలో పనిచేసే సిబ్బంది ఉండటం గమనార్హం. పాక్‌కు చెందిన ఈ విమానం టోక్యో నుంచి బీజింగ్ వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆమె బయటకు రావడాన్ని గమనించిన ఓ ప్రయాణీకుడు అవాక్కయ్యి ఆ చైనా యువతిని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. విమానంలో ప్రయాణం బాగా సాగిందా? పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ ఎలా అనిపించింది? మీరు కాక్‌పీట్‌లోకి ఎందుకు వెళ్లారు? పైలెట్ మీ బంధువా? స్నేహితుడా? నీకు తెలిసినవాడా? అని ప్రశ్నిస్తూ వీడియో తీయడం మొదలుపెట్టాడు.
అయితే, కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ వీడియో తీస్తున్న విషయాన్ని గమనించి విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీంతో సిబ్బంది ప్రశ్నించే ప్రయత్నం చేస్తుండగా అతడు ఆమెను నోర్మూసుకుని ఉండాలని, ఇక్కడ జరిగిందంతా తాను ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో పెద్ద వైరల్‌గా మారింది. దీంతో పీఐఏ సమాధానం చెబుతూ ఈ విషయాన్ని పరిశీలిస్తామని, సిబ్బంది ఇంకా బీజింగ్‌లోనే ఉందని, అయినా ప్రయాణీకురాలు కాక్‌పీట్‌లోకి వెళితే పెద్ద తప్పేం లేదు కదా అంటూ సమర్థించుకుంది. దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.