బాయ్ఫ్రెండ్ పిచ్చిలో పడి..
లండన్: ఆమె చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. కాసేపు అలాగే ఉండిపోతే తన ప్రేయసిగా వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే మాటలు అంత తీయగా ఉంటాయి. ముఖ కవలికలు అలా కవ్విస్తాయి. కానీ, ఆమె మనసు నిండా మాత్రం రాక్షసత్వం. ఎంతగా అంటే పట్టుమని పదహారేళ్లు కూడా నిండకముందే మొత్తం కుటుంబాన్నే హత్య చేసేంతటి రాక్షస మనస్తత్వం. ప్రస్తుతం 24 ఏళ్లు ఉన్న ఎరిన్ కాఫీ అనే ఆ యువతి గత ఎనిమిదేళ్లుగా తన సొంత కుటుంబాన్ని హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆమెను ఎరిన్ కాఫే అనే బ్రిటన్ కు చెందిన మాజీ జడ్జి పీర్స్ మోర్గాన్ ఆమెను జైలులో కలిశాడు. ఆ క్షణంలో ఆమెతో మాట్లాడేముందు ఏ మాత్రం జంకుబొంకు లేకుండా ప్రశ్నించాడు. ఈయన సాధరణంగా టీవీ కార్యక్రమాలకోసం ఇలా క్రూరమైన నేరాలను చేసేవారిని ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఆయనలా ఇంటర్వ్యూ చేసిన వారిలో ఇలాంటి దుష్టమహిళను తాను ఇంతవరకు చూడలేదని చెప్పారు. ఆమె తన కుటుంబాన్ని ఎందుకు హత్య చేసిందో సావధానంగా, తాఫీగా సమాధానం చెప్పిందని తెలిపారు.
ఆమె చెప్పిన ప్రకారం 2008నాటికి ఎరిన్ వయసు పదహారేళ్లు. అప్పటికే ఆమెకు అన్ని రకాల దురలవాట్లు చుట్టుకున్నాయి. ముఖ్యంగా ఓ బాయ్ ఫ్రెండ్తో తిరగడమే కాకుండా హద్దు మీరింది. తల్లిదండ్రులతో కూడా అసభ్యకరంగా మాట్లాడటం, రాత్రి వేళ బాయ్ ఫ్రెండ్ పిచ్చిలో పడి అతడి వద్దే ఉండటం లాంటిది చేసింది. ఈ విషయం స్పష్టంగా గుర్తించిన తల్లిదండ్రులు ఆమెను హెచ్చరించారు. అయితే, వారి మాటను విన్నట్లుగానే నటించిన ఎరిన్.. ఎలాగైనా తన తల్లిదండ్రులను భూమిపై ఉంచకూడదని నిర్ణయించుకుంది.
వారిని చంపేందుకు బాయ్ ఫ్రెండ్ చార్లీ, మరో స్నేహితుడు చార్లెస్ వెయిడ్.. చార్లెస్ గర్ల్ ఫ్రెండ్ బాబీ జాన్సన్ తో కుట్ర చేసింది. తొలుత ఆమె తల్లి పెన్నీపై కాల్పులు జరిపించి కత్తులతో పొడిపించింది. తమ్ముడు మాధ్యూ(13)పై కాల్పులు చేయించింది. మరో ఎనిమిదేళ్ల టేలర్ ను కత్తితో హత్య చేయించింది. ఇక తండ్రి టెర్రీపై దారుణంగా ఐదుసార్లు కాల్పులు జరిపించింది. ఈ విషయాలన్ని విన్న పీర్స్ మోర్గాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తన జీవితంలోనే ఇలాంటి దుష్టమహిళను కలుసుకోలేదని వ్యాఖ్యానించాడు.