విమానం నడుపుతూ గుండెపోటుతో పైలట్ మృతి!
220 మంది ప్రయాణికులతో ఓ విమానం 34 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా.. అకస్మాత్తుగా పైలట్‌కు గుండెపోటు వచ్చింది. గగనయానం మధ్యలోనే ఆయన ప్రాణాలు విడువగా.. గాలిలో కొట్టుమిట్టాడుతున్న 220 మంది ప్రాణాలను కో పైలట్ సమర్థంగా వ్యవహరించి.. ఒడ్డుకు చేర్చాడు. సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన ఎస్వీ 1734 విమానంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
220 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. రెండు గంటలపాటు సాఫీగా సాగిన గగనయానంలో.. మరికాసేపట్లో విమానం ల్యాండ్ అవుతుందనగా కెప్టెన్ పైలట్ వాలీద్ బిన్ మహమ్మెద్ ఆల్ మహమ్మెద్ కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన కాక్‌పీట్‌లోకి వెళ్లిపోగా.. సహ పైలట్ సలె బిన్ నాజర్ ఆల్ జసర్ ఈ అత్యవసర పరిస్థితుల్లో అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. గగనయానంలో ఉన్న విమానాన్ని పూర్తిగా తన అధీనంలోకి తీసుకొని.. ఒంటిచేతో విమానాశ్రయంలో సురక్షితంగా దింపాడు. అంతేకాకుండా విమానాశ్రయ అధికారులకు పైలట్ కు గుండెపోటు వచ్చిన వార్త తెలియజేసి.. ల్యాండ్ అయిన వెంటనే అంబులెన్సు, వైద్య సేవలు అందుబాటులో ఉంచేలా ఏర్పాటుచేశాడు.
అయితే, విమానం ల్యాండ్ అయ్యేసరికే ప్రధాన పైలట్ గుండెపోటుతో చనిపోయాడు. కో పైలట్ సంక్షోభ పరిస్థితుల్లో గుండెనిబ్బరంతో వ్యవహరించి.. ఒంటిచేతితో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారని, అపాయంలో ఉన్నట్టు కూడా వారికి తెలియలేదని సౌదీ ఎయిర్‌లైన్స్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.