ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)
బీజింగ్ : షాంఘై సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాకు చేరుకున్నారు. చైనాలోని క్వింగ్దాలో రెండు రోజులపాటు జరగనున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) 18వ సమావేశంలో ఎస్‌సీఓ దేశాల ప్రతినిధులంతా పాల్గొననున్నారు. ఎస్‌సీఓ దేశాల(చైనా, భారత్, పాకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, తజకిస్తాన్, కిర్జిస్తాన్, ఉజ్బెకిస్తాన్)కు సంబంధించిన వివిధ అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు.
పాక్ తీరుపై చర్చించనున్న భారత్
షాంఘై సదస్సులో భాగంగా ఉగ్రవాద దాడులను అరికట్టేందుకు ఎస్‌సీఓ దేశాలు అవలంబించాల్సిన విధానాల గురించి భారత్ పలు సూచనలు చేయనుంది. అంతేకాకుండా ఎస్‌సీఓ దేశాల మధ్య సరిహద్దు సమస్యలు సహా పలు అంశాల పరిష్కారంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. సదస్సులో భాగంగా జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్న మోదీ.. ముఖ్యంగా ఇస్లామాబాద్ కేంద్రంగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్న అంశాన్ని లేవనెత్తనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇదొక మంచి అవకాశం...
చైనాకు బయల్దేరే ముందు మీడియాతో మాట్లాడిన మోదీ...గతేడాది ఎస్‌సీఓలో శాశ్వత సభ్యత్వం పొందడం సంతోషంగా ఉందన్నారు. ఎస్‌సీఓ దేశాలతో ఉన్న స్నేహబంధాన్ని భారత్ ఆస్వాదిస్తోందని తెలిపారు.
ఉగ్రవాదం, వేర్పాటువాదాలకు వ్యతిరేకంగా ఎస్‌సీఓ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు షాంఘై అజెండా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. క్వింగ్దా సదస్సులో జరిగే చర్చల అనంతరం ఎస్‌సీఓ దేశాలతో భారత్ బంధం మరింత బలోపేతం అవుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment