అవినీతి, ఉగ్రవాదానికి అడ్డుకట్ట | PM Narendra Modi address at UNESCO Headquarters in France | Sakshi
Sakshi News home page

అవినీతి, ఉగ్రవాదానికి అడ్డుకట్ట

Published Sat, Aug 24 2019 4:28 AM | Last Updated on Sat, Aug 24 2019 5:01 AM

PM Narendra Modi address at UNESCO Headquarters in France - Sakshi

పారిస్‌లోని యునెస్కో హాల్‌లో భారత సంతతి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

పారిస్‌: ముందెన్నడూ లేని రీతిలో దేశంలో అవినీతికి, బంధుప్రీతికి, ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేశామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ప్రజాధనాన్ని లూటీ చేయటానికి కూడా కళ్లేలు వేశామన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు తమకు అఖండ మెజారిటీ ఇస్తూ... ‘నవభారత నిర్మాణం’ అనే గురుత బాధ్యతను తమ భుజాలపై పెట్టారన్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న  ప్రధాని మోదీ పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారత సంతతికి చెందినవారిని ఉద్దేశించి శుక్రవారం మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన.. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేయటంతో పాటు దాన్ని శిక్షార్హమైన నేరంగా చేస్తూ కీలకమైన చట్టం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని పరోక్షంగా ఆయన ప్రస్తావిస్తూ.. ‘తాత్కాలిక వ్యవహారాలకు ఇక భారత్‌లో చోటులేదు. ఎందుకంటే మనది గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ, రాముడు, కృష్ణుడు అవతరించిన గడ్డ. దాదాపు 125 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో అతి పెద్ద సమస్యగా మారిన కేవలం ఒకే ఒక్క తాత్కాలిక వ్యవహారాన్ని డీల్‌ చేయటానికి 70 ఏళ్లు పట్టిన విషయం మీరే చూశారు. ఈ పరిస్థితిపై నవ్వాలో ఏడ్వాలో నాకు తెలియడం లేదు. అయితే, శాశ్వత ప్రాతిపదికన చేపట్టే పనుల ద్వారానే లక్ష్య సాధన సాధ్యమవుతుంది’ అని స్పష్టంచేశారు.

‘ఓట్ల రూపంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారానే దేశ పురోగమనం సాధ్యమవుతోంది తప్ప మోదీ కారణంగా కాదు’ అని ఆయన పేర్కొనగానే సభికులంతా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ‘మోదీ ఉంటేనే సాధ్యం’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.‘‘నవభారత్‌ నిర్మాణం లో భాగంగానే అవినీతి, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు, ప్రజాధనం దోపిడీ, ఉగ్రవాదం వం టి వాటిపై గతంలో ఎన్నడూ లేని విధంగా పోరాటం సాగించి అడ్డుకట్ట వేశాం. అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు దూసుకెళ్తున్నాం.  కాప్‌– 21 సమ్మిట్‌లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం వాతా వరణ మార్పుల లక్ష్యాలను 2030 సంవత్సరం వరకు కాకుండా వచ్చే ఏడాదిన్నరలోనే సాధిస్తాం’’ అని ప్రధాని తెలిపారు. ఇన్‌ఫ్రా అనే పదాన్ని ప్రస్తావిస్తూ... ‘‘దీన్లో ఇన్‌ అంటే ఇండియా. ఫ్రా అంటే ఫ్రాన్స్‌. ఇన్‌ఫ్రా మాదిరిగా ఇరువురి సంబంధాలూ దృఢంగా ఉండాలి’’ అన్నారాయన.

ఫుట్‌బాల్‌ భాషలో మోదీ ప్రసంగం
భారత్‌తో ఫ్రాన్స్‌కు ఉన్న స్నేహ సంబంధాన్ని ఫుట్‌బాల్‌ ఆటతో పోలుస్తూ ప్రధాని మోదీ  ఆసక్తికర ప్రసంగం చేశారు. వివిధ పరిస్థితుల్లో భారత్, ఫ్రాన్స్‌లు కలసి నిర్మాణాత్మక పద్ధతిలో పని చేశాయన్నారు.  ‘ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే దేశానికి నేనొచ్చాను. మీకందరికీ గోల్‌ ఎంత ముఖ్యమైనదో తెలుసు. గత అయిదేళ్లలో మేం కూడా అసాధ్యం అనిపించేలా ఉన్న గోల్స్‌ను అధికారుల ఆత్మవిశ్వాసం సాధించగలిగింది’ అని ప్రధాని పేర్కొన్నారు. అంతకుముందు ప్రధాని ఫ్రాన్సులో 1950, 1960ల్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద మృతుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. ఫ్రాన్స్‌ పర్యటన అనంతరం మోదీ యూఏఈ రాజధాని అబుదాబీకి బయలుదేరారు. అక్కడి నుంచి బహ్రెయిన్‌కు వెళ్లనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement