
డైపర్ కట్టుకునే వయస్సులో గంజాయి దమ్ము
న్యూయార్క్: గంజాయి దమ్ము బిగించి కొడితే గమ్మత్తుగా ఉంటున్నట్టున్నది ఈ బుడ్డోడికి. డైపర్ ధరించి కుర్చీలో బరివాతల కూర్చొని గంజాయి దమ్ము లాగిస్తున్నాడు. దాన్ని పర్యవసనాలు తెలియని వయస్సులో పెద్దల ప్రోత్సాహంతో మత్తులో కూరుకుపోతున్నాడు. బుడ్డోడి చేష్టకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తోంది. చికాగోకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఆండ్రి హోమ్స్ ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి, దాని ప్రతిని పోలీసులకు పంపించారు.
‘ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం మూర్ఖత్వమే కావచ్చు. ఈ పిల్లవాడిని ప్రోత్సహిస్తున్న పెద్ద వాళ్లెవరో కనుక్కొని అత్యవసరంగా వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం మంచిది. అసలు పిల్లవాడెవడో గుర్తించి మెడికల్ కేర్‌లో చేర్పించడం అంతకంటే అత్యవసరం. అందుకోసమే దీన్ని పోస్ట్ చేశాను’ అని హోమ్స్ తెలిపారు.
గంజాయి దమ్ము లాగుతున్న బుడ్డోడిని ఎదురుగా నిలబడి పెద్దలు ప్రోత్సహిస్తున్నట్టు, వాడు దమ్ము కొడుతుంటే వారు పగలబడి నవ్వుతున్నట్టు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. వారు కనిపించకపోయినా వారి చేతులు మాత్రం వీడియోలో కనిపిస్తున్నాయి. ఆ పెద్ద వాళ్లెవరో దాదాపు గుర్తించామని, వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చికాగో స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ డిటెక్టివ్‌లు మీడియాకు తెలిపారు.