పాక్ లో మళ్లీ పరువుహత్యల కలకలం!
లాహోర్: గర్భిణిని ఆమె తల్లి పరువు హత్య చేసి వారం రోజులు గడవకముందే మరో ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకుని కుటుంబం పరువు తీసిందని ఆవేశానికి లోనైన ఓ వ్యక్తి.. గర్భంతో ఉన్న సోదరితో పాటు ఆమె భర్తను దారుణంగా కాల్చి హత్యచేశాడు. గతేడాది పరువు హత్యల నెపంతో పాక్ లో 1,100 మంది మహిళలు తమ తల్లిదండ్రులు, సోదరులు, బంధువుల చేతిలో హత్యకు గురయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం.. ముహమ్మద్ షకీల్(30), అక్సా(26)ను నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే వీరి పెళ్లికి అక్సా పేరెంట్స్ ఒప్పుకోలేదు. అప్పటినుంచి వీరి కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వీరు పాక్ లోని పంజాబ్ లోని థిక్రివాలాలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం అక్సా నిండు గర్భిణి. అయితే సౌదీ అరేబియాలో ఉంటున్న అక్సా సోదరుడు వారం రోజుల కిందట ఇంటికి వచ్చాడు. గత నాలుగు రోజుల కిందట అక్సా తల్లి, ఆమె సోదరుడు, సోదరుడి తరఫు బంధువులు ఈ దంపతులను కిడ్నాప్ చేశారు. వారిని చితకబాదడంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపి హత్యచేశారు. ఆ తర్వాత తమకేం తెలియదన్నట్లుగా శవాలను గుజ్రా-జంగ్ బ్రాంచ్ కాలువలో పడేసి వెళ్లిపోయారు. గురువారం రాత్రి పోలీసులు శవాలను గుర్తించారు.
షకీల్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్సా సోదరుడు, తల్లిపై కేసు నమోదు చేశారు. విచారణ జరపగా పుట్టింటివారే నిండు గర్భిణి అయిన అక్సాతో పాటు ఆమె భర్తను కాల్చి చంపినట్లు వెల్లడైంది. ఒక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వివరించారు. మరో వారం రోజుల్లో అక్సా డెలివరికి ఉందని రిపోర్టుల ద్వారా తెలిసింది.