మిడతగారూ.. బాగుంది సారూ..
ఈగ సినిమాలో సమంత ఈగ కోసం కళ్లద్దాలు తయారుచేస్తుంది.. ఇదీ దాదాపుగా అలాంటిదే.. అక్కడ ఈగ.. ఇక్కడ మిడత అంతే తేడా.. అయితే.. ఇవి త్రీడీ కళ్లద్దాలు.. ప్రపంచంలోనే అతి చిన్నవి కూడాను. బ్రిటన్‌లోని న్యూకేజిల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు వీటిని తయారుచేశారు. కేవలం 5 మిల్లీమీటర్ల వెడల్పు ఉన్న వీటిని ఓ మిడతకు తగిలించారు. వీటి ద్వారా వాటికి పలు త్రీడీ చిత్రాలు చూపించి పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
పైగా.. కీటకాల్లో మిడత మాత్రమే త్రీ డైమన్షన్స్(మూడు కోణాలు)లో చూస్తుందట. తమ పరిశోధనల ద్వారా త్రీడీ విజన్ ఎలా రూపొందింది అన్న దాని గురించి తెలుసుకోవచ్చంటున్నారు. త్రీడీ విజన్ టెక్నాలజీ అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని.. మరింత చవకగా ఈ పరిజ్ఞానం అందుబాటులోకి రావడానికి దోహదపడుతుందని వారు చెబుతున్నారు.