ఫోన్ లైట్‌తో సమస్యలు
హ్యూస్టన్: స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తెర నుంచి వెలువడే నీలం రంగు కాంతి నిద్రపై తీవ్ర ప్రభావం చూపిస్తోందట. రాత్రిపూట స్మార్ట్‌ఫోన్స్ నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్ర సమయాన్ని తగ్గించి శరీరంలో జరగాల్సిన అనేక క్రియలను నిలుపుదల చేస్తుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. భూమిపైకి అధికంగా సూర్యుడి నుంచి నీలం కాంతి వస్తుందని, అప్రమత్తత, శరీర అంతర్గత క్రియల నిర్వహణ, ఎప్పుడు నిద్రపోవాలో తెలపడం లాంటివి సూర్యుడి నుంచి వచ్చే ఈ నీలం రంగు కాంతి మనకు తెలుపుతుందని అన్నారు.
అయితే స్మార్ట్‌ఫోన్స్ నుంచి వచ్చే నీలం కాంతి ఫొటో సెన్సిటివ్ రెటినాల్ గాంగ్లియాన్ కణాలను ఉత్తేజపరిచి నిద్రకు ఉపకరించమని తెలిపే శరీరంలోని మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుందని హ్యూస్టన్ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అయితే రాత్రిళ్లు ఈ బ్లూ లైట్‌ను నిరోధించే కళ్ల అద్దాలను ధరించిన వారిలో 58 శాతం మంది శరీరంలో మెలటోనిన్ విడుదల అధికమై నిద్రా సమయం పెరిగిందని తెలిపారు.