డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
వాషింగ్టన్: అమెరికాలో విద్వేషపూరితంగా విదేశీయులపై తూటాలు పేలుతున్నా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరు ఏ మాత్రం మారలేదు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆవేశంతో యూఎస్ నేవీ మాజీ ఉద్యోగి జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంజినీర్ మరణించిన మరుసటిరోజు ట్రంప్ మరింత దురుసుగా ప్రవర్తించారు. కన్సర్వేటీవ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఏసీ)లో పాల్గొన్న ట్రంప్ ప్రసంగిస్తూ.. తానేమీ ప్రపంచానికి ప్రతినిధిని కాదని, కేవలం అమెరికాకు మాత్రమే అధ్యక్షుడిని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గన్ ఓనర్‌షిప్ రైట్స్ కోసం చర్యలు తీసుకుంటానని, అమెరికా పౌరుల రక్షణ కోసం పాటు పడతానని, అమెరికన్లకే ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సందర్భంగా ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. అయితే ట్రంప్ గానీ, వైట్ హౌస్ గానీ కన్సాస్ కాల్పుల ఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
'ప్రపంచమంతటా అన్ని దేశాలకూ కలిసి ఒకే గీతం ఉందా.. అదే విధంగా ఒకే రకమైన కరెన్సీ ఉందా.. ఒకే జెండా లాంటివి ఉన్నాయా' అని ట్రంప్ ప్రశ్నించారు. చికాగోలోని పలు ప్రాంతాల్లో తుపాకీ కాల్పుల్లో ఏడుగురు మృతిచెందడంపై ట్రంప్ ట్విట్టర్లో స్పందించారు. వారి మృతిపట్ల సంతాపం ప్రకటించారు. 'అసలు చికాగోలో ఏం జరుగుతుంది. పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. చికాగోకు ఇప్పుడు సహాయం అవసరం' అని ట్రంప్ తన ట్వీట్లో రాసుకొచ్చారు.
అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ట్రంప్.. ఇతర దేశస్తులను అమెరికా నుంచి వెల్లగొట్టేందకు సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకుంటూ విదేశీయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ట్రావెల్ బ్యాన్, వీసా రూల్స్, జాబ్ రూల్స్ అంటూ ఏదో రకంగా విదేశీయులను వారి స్వస్తలాలకు పంపించేసి.. దేశ పౌరులతోనే అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశీయులపై ఎలాంటి దాడులు జరిగినా పట్టించుకునే ప్రసక్తే లేదని, కేవలం అమెరికా ప్రజల కోరకు మాత్రమే తాను పని చేయనున్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్థానికంగానూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంబంధిత వార్తా కథనాలకై చదవండి..
(జాతి వివక్షకు 'అధికారం' తోడైతే..)
(‘కూచిబొట్ల’కు కొండంత అండ)
శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి
అమెరికాలో జాతి విద్వేష కాల్పులు
శ్రీనివాస్ కుటుంబానికి ఎన్‌ఆర్‌ఐల బాసట