సియోల్ : మానవాళిపై ప్రతాపం చూపుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాల అధినేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. లాక్‌డౌన్, సామాజిక దూరం, హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి అస్త్రాలతో వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తున్నారు. అయినా ఓవైపు కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్నా.. మరోవైపు వైరస్ బారినపడిన చాలామంది కోలుకుంటున్నారు. అయితే కరోనా కోరలు నుంచి పూర్తిగా కోలుకున్న వారికి వైరస్ మళ్లీ తిరగబడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
దక్షిణ కొరియాలో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న రెండు శాతం మంది బాధితులకు మరోసారి కరోనా పాజిటివ్‌గా తేలడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. వైరస్‌ను కొంత మేర నియంత్రించామని ఊరట చెందుతున్న వేళ మళ్లీ తిరగబడటం కలకలం రేపుతోంది. దక్షిణ కొరియా వైద్యశాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 7829మంది కోలుకున్నారు.
అయితే వీరిలో చాలా మందికి తాజాగా లక్షణాలు కనిపించడంతో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో వారిలో 163 మందికిపైగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారితో పాటు మరో 300 మందిని క్వారెంటైన్‌కు తరలించారు. ఇక దీనిపై వైద్యులు స్పందిస్తూ వైరస్ నుంచి కోలుకున్న వారికి మళ్లీ పాజిటివ్‌గా తేలడం అసాధ్యమని తెలుపుతుండగా.. తాజా కేసులపై ఆ దేశ వైద్య విభాగం ఆరా తీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment