వాషింగ్టన్: సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ రెడిట్ కో ఫౌండర్, టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ భర్త అలెక్సిస్ ఒహానియాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఆ స్థానంలో ఓ నల్ల జాతీయుడిని నియమించాలని కోరారు. ఆన్‌లైన్ పోస్ట్‌లో తన రాజీనామా గురించి తెలిపారు ఒహానియాన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నువ్వు ఏం చేస్తున్నావు అని దీని గురించి భవిష్యత్తులో నా కుమార్తె ప్రశ్నించినప్పుడు.. నేను సమాధానం చెప్పగలగాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని తెలిపారు. ఒహానియాన్, సెరెనా విలియమ్స్ మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది. (హ్యాండ్సప్.. డోంట్ షూట్!)
జాతి విద్వేషాలను అరికట్టడమే కాక నల్లజాతి సమాజానికి సేవ చేయడానికి సంస్థలో తన వాటాపై భవిష్యత్తులో వచ్చే లాభాలను ఉపయోగించుకుంటానని అలెక్సిస్ ఒహానియాన్ తెలిపారు. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని అమెరికా పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ హత్యోదంతంపై అమెరికాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒహానియాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక మాజీ ఎన్‌ఎఫ్‌ఎల్ స్టార్ కోలిన్ కైపెర్నిక్ యొక్క ‘నో యువర్ రైట్స్’ క్యాంప్‌కు మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment