అనుకున్నదొకటి... అయ్యిందొకటి
అగ్రరాజ్యం అధిపతిగా ప్రతి మాటను ఎంత ఆచితూచి మాట్లాడాలో ట్రంప్‌కు ఖతర్ ఉదంతంలో తెలిసివచ్చింది. గత నెలలో సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లినప్పుడు తీవ్రవాదులకు, వేర్పాటువాదులకు సహాయం చేస్తున్న ఇరాన్‌ను ఏకాకిని చేయాలని ట్రంప్ పిలుపు ఇచ్చారు. ఐసిస్‌కు, ఇతర ఉగ్రమూకలకు ఇరాన్ నిధులు అందజేస్తోందన్నారు. అమెరికా అండ కోసం చూడకుండా తమ దేశాల, భావితరాల శ్రేయస్సు దృష్ట్యా పశ్చిమాసియా దేశాలు తమ కార్యచరణను రూపొదించుకోవాలన్నారు.
సౌదీ అరేబియా దీన్ని మరోలా అర్థం చేసుకుంది. ఇరాన్‌ను కట్టడి చేయడం అంత సులువైన పనికాదు కాబట్టి... తమ పొరుగున పంటికింద రాయిలా మారిన ‘ఖతర్’పై కత్తిదూసింది. ట్రంప్ మాటలను సానుకూల సంకేతంగా తీసుకొని... యూఏఈ, యెమెన్, బహ్రయిన్‌లతో కలిపి ఖతర్‌తో సంబంధాలను తెంపేసుకుంది. ఇరాన్‌తో అంటకాగుతూ తీవ్రవాదానికి ఊతమిస్తోందని ఆరోపించింది. సౌదీలో ట్రంప్ మాట్లాడినపుడు పర్యవసానాలను ఊహించని అమెరికా ఇప్పుడు అరబ్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి తంటాలు పడుతోంది.
చిన్ని దేశం... గ్యాసే బలం
ఖతర్ 26 లక్షల జనాభా, 11,586 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన పశ్చిమాసియాలోని చిన్నదేశం. ప్రపంచంలోనే చమురు, సహజవాయువు నిక్షేపాలు అధికంగా ఉన్న దేశాల జాబితాలో నాలుగోస్థానం ఈ బుల్లిదేశానిదే. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) అతిపెద్ద ఎగుమతిదారు. ప్రపంచ ఎల్‌ఎన్‌జీ ఎగుమతుల్లో ఖతర్ వాటా 31.8 శాతం. ఇదే వీరి బలం కూడా. తలసరి ఆదాయపరంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. తలసరి ఆదాయం 83 లక్షల రూపాయలు. ముస్లిం దేశాల్లో అత్యంత ఆదరణ కలిగిన ‘అల్ జజీరా’ టీవీ ఛానల్ ఖతర్ ప్రభుత్వానిదే.
పెద్దన్నను కాదని...
పశ్చిమాసియా ప్రాంతంలో సౌదీ అరేబియా పెద్దన్న పాత్రను పోషిస్తోంది. అరబ్ దేశాల్లో సున్నీల పాలనలో ఉన్న దేశాలకు సౌదీ మార్గనిర్దేశం చేస్తోంది. భౌగోళికంగా సువిశాల దేశం కావడం, చమురు నిక్షేపాలు పుష్కలంగా ఉండటం, పైగా దీర్ఘకాలంగా అగ్రరాజ్యం అమెరికాతో బలమైన మైత్రి ఉండటంతో ఈ ప్రాంతంలో సౌదీ ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే దాదాపు రెండు దశాబ్దాలుగా ఖతర్ సున్నీ రాజ్యాల బాటలో వెళ్లకుండా విదేశాంగ విధానంలో స్వతంత్ర వైఖరిని అవలంభిస్తోంది. సంపన్న దేశం కావడం, మీడియా అండ ఉండటంతో పశ్చిమాసియాలో ఖతర్‌కు స్థాయికి మించిన ప్రాధాన్యం దక్కుతోంది. సౌదీ దీన్ని సహించలేకపోతోంది.
భిన్న మార్గం...
ఈజిప్టులో ముస్లిం బ్రదర్‌హుడ్‌కు సహాయపడ్డ ఖతర్... ఇజ్రాయిల్‌లో హమస్‌కు అన్నిరకాలుగా అండదండగా నిలుస్తోంది. హమస్ అగ్రనేతలు దోహాలో తలదాచుకోవడానికి అనుమతించింది. మరోవైపు గల్ఫ్‌లో అమెరికా అతిపెద్ద సైనిక స్థావరం కూడా ఖతర్‌లోనే ఉంది. ఇక్కడి ఎయిర్‌బేస్‌లో ఏకంగా 11 వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. ప్రాంతీయంగా బలీయమైన శక్తులు, బద్ధవిరోధులైన సౌదీ అరేబియా, ఇరాన్‌లలో ఏదో పక్షం పక్కన చేరకుండా... రెండుదేశాలతోనూ సంబంధాలు నెరుపుతూ స్వతంత్రంగా ఉంటోంది.
అమెరికా సైనిక స్థావరానికి అనుమతిచ్చినట్లుగానే... పలు తీవ్రవాద సంస్థల రాజకీయ కార్యాకలాపాలను తమ గడ్డ మీద అనుమతించింది. ఈ సానుభూతితోనే తీవ్రవాద సంస్థలేవీ ఖతర్‌లో కార్యచరణకు దిగవు. అలాగే మరోవైపు అరబ్ దేశాల మధ్య తలెత్తే విబేధాల్లో ఖతర్ మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటుంది. దౌత్యవ్యవహారాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. మరోవైపు తమకున్న సంబంధాల దృష్ట్యా తీవ్రవాద సంస్థలతోనూ బేరసారాలు నెరపగలదు. బందీలను తీవ్రవాద చెర నుంచి విడిపించింది కూడా. అరబ్ విప్లవాన్ని సమర్థించింది.
షియా... సున్నీ విబేధాలు
స్వతంత్ర వైఖరితో పాటు షియా– సున్నీ విబేధాలు కూడా సౌదీ, యెమెన్, యూఏఈ, ఈజిప్టులు ఖతర్‌తో సంబంధాలను తెంచుకోవడానికి ఒక కారణం. సౌదీ, ఖతర్‌తో సహా చాలా అరబ్ దేశాల్లో సున్నీ పాలకులే ఉన్నారు. రాజరిక పాలన ఉన్న ఈ దేశాల్లో సున్నీ రాజవంశాలు అధికారంలో ఉన్నాయి. ఖతర్‌కు చేరువ కావడం ద్వారా షియా ఆధిక్య ఇరాన్... సున్నీ రాజ్యాలను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందనేది సౌదీ అరేబియా అనుమానం. తమను అధికారంలో నుంచి కూలదోసే కుట్ర జరుగుతోందనేది సున్నీ రాజుల భయం. అల్ జజీరా ఛానల్ ద్వారా తీవ్రవాద అనుకూల ప్రచారాన్ని నిర్వహిస్తోందని, తిరుగుబాటుదారులను రెచ్చగొడుతోందని ఖతర్‌పై సౌదీ ఆరోపణ.
తమ దేశంలోని తూర్పు ప్రాంతమైన ఖాతిఫ్‌లో (షియాల ఆధిక్య ప్రాంతం) ఇరాన్ దన్నుతో దాడులకు దిగుతున్న మిలిటెంట్లకు ఖతర్ మద్దతిస్తోందని కూడా సౌదీ ఆరోపించింది. ఇరాన్‌పై ట్రంప్, సౌదీల వైఖరిని తప్పుపడుతూ ఖతర్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ వ్యాఖ్యలు చేసినట్లు దేశ అధికారిక వార్తాసంస్థలో వచ్చింది. తమ సైట్‌ను ఎవరో హ్యాక్ చేసి ఈ పనిచేశారని ఖతర్ వివరణ ఇచ్చింది. దీనిని సౌదీ కూటమి తీవ్రంగా ఖండించింది. అల్ జజీరాతో పాటు ఖతర్‌కు చెందిన ఇతర మీడియా సంస్థలను నిషేధించాయి సౌదీ, మిత్రదేశాలు. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడిగా హసన్ రౌహానీ మే నెలలో మరోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఖతర్ రాజు షేక్ తమీమ్... రౌహానికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. దీన్ని సౌదీ కవ్వింపు చర్యగా పరిగణించింది. ఫలితంగా కొద్దిరోజులగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అదును కోసం చూసిన సౌదీ ట్రంప్ వ్యాఖ్యలను సానుకూలంగా తీసుకొని ఖతర్‌తో కటీఫ్ అంది.
తిండికి కటకట...
ఖతర్ ద్వీపకల్పం. ఒక్క సౌదీతో మాత్రమే ఈ దేశానికి భూ సరిహద్దు ఉంది. అన్ని రకాల రవాణా మార్గాలను మూసివేస్తున్నట్లు సౌదీ ప్రకటించిన నేపథ్యంలో ఖతర్‌పై తక్షణ ప్రభావం పడేది ఆహారం విషయంలోనే. . ఎందుకంటే ఖతర్ దిగుమతి చేసుకునే ఆహారంలో 40 శాతం సౌదీ నుంచే వస్తుంది. సౌదీ కీలక మిత్రదేశమైనప్పటికీ ఖతర్‌తోనూ అమెరికాకు అవసరం ఉంది. సైనిక స్థావరమే కాకుండా అమెరికా సంస్థల్లో భారీ పెట్టుబడులకు ఖతర్ హామీ ఇచ్చింది.
వీటిని దృష్టిలో పెట్టుకునే అమెరికా ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ఖతర్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్‌ను సైనిక తిరుగుబాటును ప్రొత్సహించడం ద్వారా కూలదోయాలని సాదీ ప్రయత్నిస్తోందని రాజు అనుకూలవర్గాలు ఆరోపిస్తున్నాయి. చర్చలు జరిగితే తీవ్రవాదులకు నిధులు నిలిపివేయడం లాంటి వాటికి ఖతర్ అంగీకరించొచ్చు. అయితే ఇరాన్‌తో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని సౌదీ, దాని మిత్రదేశాలు డిమాండ్ చేస్తే మాత్రం... ఖతర్ ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే భారీ గ్యాస్ నిక్షేపాలున్న ‘నార్త్ ఫీల్డ్’పై ఖతర్, ఇరాన్‌లకు ఉమ్మడి యాజమాన్య హక్కులున్నాయి. ఖతర్ ఆర్థిక పటిష్టతకు నార్త్‌ఫీల్డ్ చాలా కీలకం. ఈ నేపథ్యంలో పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్