
మనీలా: క్రిస్మస్ పండుగ పర్వదినాన ఉత్తర ఫిలిప్పీన్స్ లో సోమవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 20 మంది చనిపోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. కొంతమంది యాత్రికులతో బయల్దేరిన మినీ బస్సు మరో బస్సును అగూ నగరంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో పదహేను మంది గాయపడ్డారు.
క్రిస్మస్ పండుగ సందర్భంగా వీరంతా శతాబ్దాల క్రితం నిర్మించిన మనాగ్ చర్చిని సందర్శించేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్రిస్మస్ వేడుకలకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకోవడం పెనువిషాదం మిగిల్చింది. దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని దావో నగరంలో ఉన్న ఎన్‌సీసీసీ షాపింగ్ మాల్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 37 మంది మరణించిన మరవకముందే మరో దుర్ఘటన జరిగింది.