కాలిఫోర్నియాలో ప్రారంభమైన ఐదంతస్తుల పార్కింగ్ భవనం
పార్కింగ్ ఇబ్బందులు ఎలా ఉంటాయో నగరవాసికి తెలియంది కాదు. మాల్స్లోనైనా, వీధుల్లోనైనా వాహనాన్ని నిలిపేందుకు తగిన స్థలం ఉండటం ఒక సమస్య. ఒకవేళ ఉంటే.. ఆ ప్లేస్‌కు మన కారును సురక్షితంగా తీసుకెళ్లడం ఇంకో ఇబ్బంది. ఈ మధ్యకాలంలో అక్కడక్కడా కొన్ని ఆటోమేటిక్ పార్కింగ్ గ్యారేజీలు అందుబాటులోకి వచ్చినా... వాటిల్లో కూడా మనుషులే ఎక్కువగా పనిచేస్తూంటారు. ఇక విషయానికొద్దాం. ఈ ఫొటోలు చూశారుగా... కాలిఫోర్నియాలోని వెస్ట్ హాలీవుడ్ ప్రాంతంలో ఈ మధ్యే ఏర్పాటు చేసిన అత్యాధునిక పబ్లిక్ కార్ పార్కింగ్ స్థలమిది. చూసేందుకు అలా కనిపించదులెండి. ఈ ఐదంతస్తుల భవనంలో ఏకంగా 200 కార్ల వరకూ పడతాయి.
వాహనాన్ని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న ఎంట్రెన్స ద్వారా లోపలికి తీసుకెళ్లి, లాక్ చేసి వదిలేస్తే సరి... మిగిలిన పనంతా అడ్డంగాను, నిలువుగానూ వెళ్లగల లిఫ్ట్‌లు, రోబోలు చూసుకుంటారుు. మీరు కారు పార్క్ చేసిన వెంటనే ఒక సాఫ్ట్వేర్ అసలు పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఖాళీ ఉందో గుర్తిస్తుంది. ఆ వెంటనే ఆ ప్రాంతానికి చేరుకునేందుకు ఉన్న అతి దగ్గరి దారేమిటో నిర్ణయమవుతుంది. ఇక ఆ అంతస్తుకు, ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా కారు అడుగున ఉన్న లిఫ్ట్ తన దిశను మార్చుకుంటుంది. నిర్ణీత పార్కింగ్ ప్లేస్‌కు రాగానే.. ఓ రోబో చక్రాల కిందకు దూరిపోతుంది. నాలుగు చక్రాలు నిలువుగా ఉన్నాయా? లేదా? కిటికీ అద్దాలు మూసి ఉన్నాయా? ఇంజిన్ ఆఫ్ అరుు ఉందా? వంటి అన్ని అంశాలను పరిశీలిస్తుంది. ఆ తరువాత చక్రాలకు రెండు వైపుల నుంచి చేతుల్లాంటి పరికరాలు ముందుకొస్తాయి.
ఇదిగో గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఈ ఎంట్రెన్స్లోంచే మీ కారు.. భవంతిలోకి వెళుతుంది
కారును పైకి ఎత్తి పట్టుకుంటాయి. ఇప్పుడు ఆ రోబో వాహనాన్ని నిర్ణీత పార్కింగ్ స్థానంలోకి చేరుస్తుంది. వాహనాన్ని మనం మళ్లీ తెప్పించుకోవాలంటే ఇదే ప్రాసెస్ రివర్స్‌లో జరుగుతుందన్నమాట. అతితక్కువ స్థలంలో మనిషి అవసరం లేకుండా ఎక్కువ సంఖ్యలో కార్లను పార్క్ చేసేందుకు ఈ టెక్నాలజీ భలే ఉపయోగపడుతుందని అంచనా. రెండేళ్ల క్రితం దీని నిర్మాణం మొదలుకాగా... ఈ మధ్యనే ఓపెన్ చేశారు. పార్కింగ్‌కు ఎంత చార్జ్ చేస్తారో తెలియలేదుగానీ, నిర్మాణానికి మాత్రం కోటీ అరవై లక్షల డాలర్లు ఖర్చయిందట! రూపాయల్లో చెప్పాలంటే... దాదాపు వందకోట్లు!
ఏ అంతస్తులో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి ఆటోమేటిక్‌గా కారు వెళ్లిపోతుంది!