
చిన్నారి రోమన్ డింకిల్
చిన్న చిన్న సమస్యలకే భయపడుతూ.. క్షణికావేశంలో నూరేళ్ల జీవితాన్ని ముగించుకునే వారేందరో. అలాంటి వారందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ రెండేళ్ల బుడతడు. నడవడమే అసాధ్యమన్న డాక్టర్లు ఇప్పుడు ఆ చిన్నారి అడుగులు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ బుడిబుడి అడుగులే ఇప్పుడతన్ని ఇంటర్నెట్ స్టార్‌గా మార్చాయి. పెంపుడు కుక్కతో పాటు అడుగులేస్తున్న రోమన్ డింకిల్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను కొన్ని లక్షల మంది వీక్షించారు. ఈ చిట్టి అడుగులే ఇప్పుడు జీవితం మీద ఆశలు కోల్పోయిన ఎందరికో నమ్మకాన్ని కల్గిస్తున్నాయి .
రోమన్ తల్లి చెప్పిన వివరాల ప్రకారం.. ‘గర్భంలో ఉన్నప్పుడే రోమన్‌కి వెన్నెముకకు సంబంధించిన అనారోగ్యం తలెత్తింది. అయినా పిండం ఎదుగుదలకు మాత్రం ఎటువంటి ఆటంకం కలగలేదు. రోమన్ జన్మించిన తరువాత అతను నడవడం అసాధ్యమన్నారు డాక్టర్లు. కానీ మేము మాత్రం మా బిడ్డ చేత నడిపించాలనుకున్నాము. అందుకు ఎన్నో ఆస్పత్రులకు తిరిగాము. ఒక 4 నెలల క్రితమే రోమన్‌కి అల్ట్రా సౌండ్ చికిత్స చేయించాము. ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత రోమన్ చేత నడక ప్రయత్నాలు చేయించేవాళ్లం.
కానీ కొద్ది దూరం నడవగానే పడిపోయేవాడు. దాంతో నేను లేదా నా భర్త పక్కనే ఉండి తనను పట్టుకొని నడిపించే ప్రయత్నం చేసేవాళ్లం. అలాంటిది ఉన్నట్టుండి ఒక రోజు చాలా ఆశ్యర్యకరమైన సంఘటన జరిగింది. మా ఇంట్లో మాగీ అనే పెంపుడు కుక్క ఉండేది. అదంటే రోమన్‌కి చాలా ఇష్టం. ఆ రోజు మాగీ రోమన్ ముందుకు రాగానే వాడు సంతోషం పట్టలేకపోయాడు. దాన్ని చూస్తూ ఆ సంతోషంలో దానితో పాటు నడవడం ప్రారంభించాడు. రోమన్ నడవడం చూసి నాకు కన్నీరు ఆగలేదు. నా సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలని అనుకున్నాను.
అందుకే ఈ వీడియోను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశాను. కానీ ఇంత భారీ స్పందన వస్తుందనుకోలేదు. ఇప్పటికే ఈ వీడియోను కొన్ని లక్షల మంది చూశారు. వారందరు మా రోమన్‌ను పొగుడుతుంటే చాలా సంతోషంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment