టోక్యో: తూర్పు చైనా సముద్రంలో అమెరికా, రష్యా యుద్ధనౌకలు శుక్రవారం ఢీకొట్టుకోబోయాయి. అయితే చివరి నిమిషంలో రెండునౌకల కెప్టెన్లు అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ విషయమై అమెరికాకు చెందిన 7వ ఫ్లీట్ స్పందిస్తూ..‘మా నౌక యూఎస్‌ఎస్ చాన్స్‌లర్‌విల్లే తూర్పుచైనా సముద్రంలో శుక్రవారం స్థిరంగా వెళుతోంది. ఈ క్రమంలో వెనుకే వస్తున్న రష్యన్ డెస్ట్రాయర్ యుద్ధనౌక ఒక్కసారిగా వేగం పెంచి 50 మీటర్ల సమీపానికి వచ్చేసింది.
దీంతో యూఎస్‌ఎస్ ఛాన్స్‌లర్‌విల్లేలోని అన్ని ఇంజన్లను మండించి రెండు నౌకలు ఢీకొట్టకుండా చూడగలిగాం. రష్యా వ్యవహారశైలి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేలా ఉంది’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై రష్యా స్పందిస్తూ..‘మా అడ్మిరల్ వినొగ్రడోవ్ డెస్ట్రాయర్ నౌక వెళుతున్న మార్గానికి అడ్డంగా అమెరికా యుద్ధనౌక అకస్మాత్తుగా వచ్చేసింది. దీంతో మా నౌకను మరోదిశకు మళ్లించి రెండు యుద్ధనౌకలు ఢీకొట్టుకోకుండా నివారించగలిగాం. ఈ విషయంలో అమెరికాకు మా నౌకాదళం నిరసనను తెలియజేసింది’ అని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment