అతని చెయ్యే.. ఓ కార్డు
లండన్: టైమ్ సేవ్ చేయడానికి, ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేయడానికి రష్యాకు చెందిన టెకీ వ్లాద్ జైస్తేవ్ వినూత్నంగా ఆలోచించాడు. ఏకంగా ట్రావెలింగ్ కార్డు, ఆఫీస్ ఐడీ కార్డులను తన చేతిలో (చర్మం కింద)అమర్చుకున్నాడు. ఆఫీసుకు వెళ్లినప్పుడు ఐరిష్ ఇవ్వడం లేదా కార్డు స్వైప్ చేయడం వంటి వాటితో ఎంతో కొంత సమయం వృధాఅవుతుంది. దాంతో పాటు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే మనతో పాటు అందుకు కావాల్సిన కార్డును తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈ రెండింటిని చేతిలో అమర్చుకుంటే టైం సేవ్ అవుతుందని ఇంజినీర్ వ్లాద్ జైస్తేవ్ భావించాడు. ఎసిటోన్ ద్రావణంలో తన రెండు కార్డులను కరిగించి, ఆ తర్వాత మిగిలిన సిలికాన్ లోహాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేశాడు.
కత్తితో చేయిని కోసుకుని ఆ చిన్న ముక్కలను తన చేతిలో అమర్చుకుని కుట్లేసుకున్నాడు. తన మరో చేతికి ఇప్పుడు క్రెడిట్ కార్డును ఇంజెక్ట్ చేసుకోవాలని ప్రస్తుతం అదేపనిలో ఉన్నాడు. ఇలా చేయడం వల్ల టీ తాగడానికి వెళ్లినా, టిక్కెట్లు కొనుక్కోవాల్సి వచ్చినా డబ్బులు, కార్డుల కోసం చూసుకోవాల్సిన పని ఉండదని టెకీ జైస్తేవ్ అంటున్నాడు.
జర్మనీకి చెందిన ఓ హ్యాకర్ వినూత్న ఆలోచనను చూసి జైస్తేవ్ స్ఫూర్తిపొందినట్లున్నాడు. జర్మనీకి చెందిన ఓ హ్యాకర్ టిమ్ కానన్ చేతిలో ఇంజెక్ట్ చేసుకున్న చిన్న చిప్ శరీరానికి సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది. ఆ డేటాని ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్కు కూడా బదిలీచేసుకోవచ్చును.