రూ. 2 వేల కోట్లు.. ఎడాపెడా పంచేశారు!
ఒకవైపు యూరోపియన్ దేశాలు డబ్బు లేక అల్లాడుతూ పొదుపు చర్యలు పాటిస్తుంటే.. సౌదీ అరేబియాలో మాత్రం అక్కడి కొత్త రాజుగారు తన ప్రజలకు డబ్బులు విరివిగా పంచిపెడుతున్నారు. ఓ చిన్న రాజాజ్ఞ వేసి.. వందల కోట్ల డాలర్లను సామాన్య ప్రజలకు ఇచ్చేస్తున్నారు. తమ రాజు సల్మాన్ ఔదార్యం చూసి సౌదీ అరేబియా ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తమ దేశంలో వాళ్లంతా ప్రస్తుతం పార్టీలు చేసుకుంటున్నారని రియాద్కు చెందిన వ్యాపారవేత్త జాన్ చెప్పారు. సౌదీ రాజు ఇలా ఇస్తున్న బహుమతుల విలువ దాదాపు 2 వేల కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఆఫ్రికాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన నైజీరియా వార్షిక బడ్జెట్ కంటే కూడా సౌదీ అరేబియాలో ఇప్పుడు ఎక్కువ డబ్బు ఉంది. గత నెలలో సౌదీ అరేబియా రాజుగా సింహాసనం అధిష్ఠించిన సల్మాన్.. ప్రభుత్వ సంస్థలను రద్దుచేసేస్తున్నారు, మంత్రులను పీకి పారేస్తున్నారు. అయితే మరోవైపు ప్రజలకు మాత్రం విరివిగా డబ్బులు పంచిపెట్టేస్తున్నారు.