
అస్థిపంజరానికి అంత్యక్రియలు!
ఆ పాఠశాల విద్యార్థులు అస్థిపంజరానికి అంత్యక్రియలు నిర్వహించారు. అస్థిపంజరమేమిటి?అంత్యక్రియలేమిటి? అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. తమ స్కూల్ ల్యాబ్ లో సుమారు అర్థ శతాబ్దం పాటు సేవలందించిన ఆ అస్థిపంజరం.. ఇటీవలే నిజమైనదని తెలిసింది. దీంతో ఏళ్ళతరబడి తమకు సేవలందించిన ఆ అస్థిపంజరానికి అంత్యక్రియలు నిర్వహించాలని పాఠశాల నిర్ణయించింది. యధావిధిగా శవపేటికలో ఉంచి, శ్మశానానికి తరలించి, విద్యార్థులంతా దానిచెంత ఎర్రగులాబీలు ఉంచి నివాళులర్పించగా.. ఘనంగా అంతిమ సంస్కార కార్యక్రమం పూర్తి చేశారు.
మెర్సీసైడ్.. సెయింట్ హెలెన్స్ దగ్గరలోని హేడాక్ హైస్కూల్ ల్యాబ్ లో విద్యార్థులకు మానవ శరీర భాగాలను వివరించేందుకు ఉపయోగిస్తున్న అస్థిపంజరం.. నిజంగా ఓ వ్యక్తిదని తెలిసి స్కూల్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ల్యాబ్ టెక్నీషియన్... ప్రయోగశాలలోని అల్మారానుంచి బయటకు తీసినప్పుడు అనుమానంతో దాని ఎముకలకు పరీక్షలు నిర్వహించారు. అవి సుమారు 19వ శతాబ్దంనాటి, ఆసియా ప్రాంతంలోని 17 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తివిగా గుర్తించారు. నిజానికి 19వ శతాబ్దంనాటి అస్తిపంజరం అక్కడకు ఎలా వచ్చింది? ఆ వ్యక్తి మరణానికి ముందు బ్రిటన్ చేరుకున్నాడా? లేక ఆ అస్థిపంజరాన్ని తెచ్చి స్కూల్లో ఉంచారా అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. స్థానిక శ్మశాన నిర్వాహకులు కూడ అంత్యక్రియలకు ఎటువంటి ఛార్జీలు వేయకుండా ఉచితంగా సేవలు అందించారు.
ఏ వ్యక్తి జీవితమైనా ఒకటేనని, ఏభై ఏళ్ళకు పైగా తమ పాఠశాలలో సేవలందించిన అస్థిపంజరం.. నిజంగా ఓ వ్యక్తిదని తెలిసి... కనీస గౌరవం అందించడంలో భాగంగానే తాము అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించామని పాఠశాల సిబ్బంది చెప్తున్నారు.