నెస్సీ ఉహాచిత్రం
స్కాట్‌లాండ్ : శాస్త్రవేత్తలు ఓ వింతజీవి కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఆ జీవి ఉనికి ప్రశ్నార్థకమైనా.. స్కాట్‌లాండ్ ప్రజల నమ్మకాల్లో మాత్రం అదొక అద్భుత జీవి. ‘లాస్ నెస్ మాన్‌స్టర్’ దాని పేరు. నెస్సీ అని పిలవబడే నీటి జంతువు ఇది. స్కాట్‌లాండ్ దీవుల్లోని సరస్సులో జీవిస్తుంటుందని అక్కడి ప్రజల నమ్మకం. పొడవాటి మెడ, తాబేలు లాంటి మొండెం భారీ ఆకారం ఇది ఆ జీవి ఆనవాళ్లు. ఇప్పటి వరకూ ఈ జీవిని చూశామని చాలామంది అంటున్నా దాని ఉనికికి తగిన ఆధారాలు చూపించలేక పోతున్నారు.
నెస్సీ ఉనికికి సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ జీవి సరస్సు అట్టడుగు భాగాల్లో జీవిస్తుందని కొంతమంది అంటే.. అదొక పెద్ద చేప అని క్యాట్‌ఫిష్ లాంటిదని మరికొందరి అభిప్రాయం. డైనోసార్స్ అంతరించిపోయిన తర్వాత బ్రతికున్న వాటిలో నెస్సీల జాతి ఒకటనే వాదన ఉంది. ఏదైతేనేం వింత జీవి ఉనికి నిగ్గుతేల్చాలని న్యూజిలాండ్‌కు చెందిన నీల్ జెమెల్ అనే శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ఓ బృందం అన్వేషణకు బయలుదేరుతోంది. బృంద నాయకుడు జెమెల్ మాట్లాడుతూ.. తనకు నెస్సీ ఉనికి సంబంధిత కథలపై నమ్మకం లేదన్నారు. ప్రజలకు దీని గురించి ఓ అవగాహన కల్పించడానికి ఈ ప్రయాణం తోడ్పడుతుందన్నారు.
ఏదైనా ఒక జీవి నీటిలో తిరుగాడినపుడు ఆ జీవి శరీరంలో ఉన్న డీఎన్‌ఏని ఆ నీటిలో విడిచిపెడతాయని అన్నారు. డీఎన్‌ఏ ఆధారంగా ఆ జీవుల జన్యు సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు. సరస్సులోని వివిధ చోట్ల నుంచి, వివిధ లోతుల నుంచి నీటిని సేకరించి లాబ్‌లో టెస్ట్ చేయించటం ద్వారా ఆ నీటిలో నివసించే అన్ని రకాల జీవులకు సంబంధించిన ఉనికి బయటపడుతుందని తెలిపారు. ఒకవేళ తాము నెస్సీ లేదని నిరూపించినా ఆ జీవి ఉందని నమ్మేవారు దీన్ని ఒప్పుకోరన్నారు. హాలీవుడ్‌లో ఇప్పటివరకు నెస్సీకి సంబంధించిన చాలా సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో చాలా సినిమాలు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment