సిడ్నీ: చైనా ఆహార మార్కెట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ), ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన సదరు మార్కెట్లు ప్రపంచానికి సమస్యగా పరిణమించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ఆనవాళ్లు తొలిసారిగా చైనాలో బయటపడిన విషయం తెలిసిందే. వుహాన్ నగరంలో గతేడాది డిసెంబరులో పురుడు పోసుకున్న ఈ ప్రాణాంతక వైరస్ ధాటికి ప్రస్తుతం ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. (ప్రధాని మోదీపై డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసల వర్షం)
ఈ నేపథ్యంలో చైనీయుల ఆహారపుటలవాట్లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చైనా మార్కెట్లలో ఇబ్బడిముబ్బడిగా కుక్కలు, పిల్లులు, గబ్బిలాలు ఇతర జంతువుల మాంసం అపరిశుభ్ర వాతావరణంలో అమ్ముతుండటం వల్లే ప్రాణాంతక వైరస్ పుట్టుకొచ్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (కరోనా: డబ్ల్యూహెచ్‌ఓ తీరుపై ట్రంప్ విమర్శలు)
‘‘తడి మార్కెట్ల(అపరిశుభ్ర మాంసం మార్కెట్లు) కారణంగా ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో మనందరికీ తెలుసు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని డబ్ల్యూహెచ్‌ఓ, ఐరాస చర్యలు తీసుకోవాలి. ఈ వైరస్ చైనా మార్కెట్లో ఉద్భవించి ప్రపంచం మొత్తం విస్తరించింది. దీని కారణంగా ప్రపంచ మానవాళి మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచానికి ఇది సవాలు విసిరింది. ఇలాంటి పరిస్థితుల్లో సదరు మార్కెట్లపై చర్యలు తీసుకోనట్లయితే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది’’ అని మారిసన్ హెచ్చరించారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 51 వేల మంది మరణించగా.. పది లక్షల మంది దీని బారిన పడ్డారు.(చైనాకు పేరుప్రఖ్యాతులే ముఖ్యం: నిక్కీ హేలీ)
Comments
Please login to add a commentAdd a comment