లాటీరీతో ఫ్రెడ్, లెస్లీ హిగిన్స్ దంపతులు
స్కాట్లాండ్: ఏదైన విలువైన వస్తువు పోగొట్టుకుని తిరిగి పొందితే మురిసి పోతాం. అదృష్టమంటే నీదేరా..! అంటారందరు. కానీ, వందల కోట్ల లాటరీ తగిలితే..! పోయిందనుకున్న ఆ లాటరీ టికెట్ మళ్లీ కంటబడితే.. అంతకన్నా అదృష్టవంతులు ఎవరుంటారు..! స్కాట్లాండ్‌లో ఇలాంటి అద్భుతమే జరిగింది. అబెర్‌డీన్ షైర్‌కు చెందిన వృద్ధ దంపతులు ఫ్రెడ్ (57), లెస్లీ హిగిన్స్ (67) ‘లైఫ్ చేంజింగ్’ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. అయితే.. డ్రాలో తమ నెంబర్ వచ్చిందేమోనని స్థానికంగా ఉండే లాటరీ ఆఫీస్‌కి వెళ్లగా అక్కడ నిరాశే ఎదురైంది. ఎటువంటి లాటరీ రాలేదని వారి టికెట్‌ను అక్కడి సిబ్బందిలో ఒకరు చించి చెత్త బుట్టలో వేశాడు. అయితే, హిగిన్స్‌కు మాత్రం సిబ్బంది నిర్లక్ష్యంగా తన టికెట్‌ను చించాడేమోనన్న అనుమానం వీడలేదు.
ఎన్నోసార్లు కొన్నాడు.. కానీ
హిగిన్స్‌కు లాటరీ టికెట్‌లు కొనడం.. ప్రతి మంగళవారం, శుక్రవారం జరిగే డ్రాలకు హాజరవడం అలవాటు. అయితే.. గత జూలై 10న (మంగళవారం) జరిగిన డ్రా మాత్రం తన జీవితాన్ని మార్చేసింది. సిబ్బంది సరిగా చూడకుండానే తన లాటరీ టికెట్ చించి పడేశాడనీ ఆరోపిస్తూ ఆయన సహాయ కేంద్రంలో విచారణ కోరారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతని నెంబర్‌ను కనుగొని.. డ్రాలో హిగిన్స్ నెంబర్ ఉందని విచారణలో తేల్చారు. డస్ట్‌బిన్‌ను మొత్తం వెతికించి అతని టికెట్‌ను కనుగొన్నారు. జీవితంలో ఎప్పడూ చూడనంత మొత్తాన్ని.. అక్షరాల 461 కోట్ల రూపాయల జాక్‌పాట్‌ను ఆ హిగిన్స్ దంపతులకు అందించారు. పెద్ద మొత్తంలో లాటరీ గెలుచుకోవడంతో హిగిన్స్ దంపతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. మొదటగా ఒక ఖరీదైన ఆడి కారు, కరీబియన్ దీవుల్లోని బార్బడోస్‌లో విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment