
కిమ్ జాంగ్ ఉన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు
బీజింగ్ : ఉత్తర కొరియాతో నేరుగా మాట్లాడగల కమ్యునికేషన్ వ్యవస్థ తమకు ఉందని, దానిని ఇప్పటికీ కొనసాగిస్తున్నామని అమెరికా విదేశాంగ కార్యదర్శి రెక్స్ టిల్లర్‌సన్ చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నిప్పటికీ, దేశాధ్యక్షులు ఒకరిపై ఒకరు దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ చర్చలకు కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. అయితే, ఉత్తర కొరియా అసలు చర్చలకు సిద్ధంగా ఉందా లేదా అనే విషయాన్ని ప్రస్తుతం తమ అధికారులు విచారణ చేస్తున్నారన్నారు.
వెంటనే అణు పరీక్షలు ఆపేయాలని, శాంతియుత పరిస్థితులు స్థాపించాలని ఇప్పటికే పిలుపునిచ్చామని తెలిపారు. 'ప్యాంగ్‌యాంగ్‌తో కమ్యూనికేషన్‌కు మాకు లైన్స్ ఉన్నాయి. మేం అంత గడ్డు పరిస్థితుల్లో లేము.. ప్యాంగ్ యాంగ్‌తో మాట్లాడేందుకు రెండు నుంచి మూడు చానల్స్ మాకున్నాయి. మేం వారితో మాట్లాడగలం.. మాట్లాడతాం' అని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఎలాంటి చానల్స్ ఉన్నాయనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్‌ను కలిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.