చైనాకు అమెరికా భారీ షాక్‌.. | Senate Passes Bill To Delist Chinese Companies From Exchanges | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ చైనా : కీలక బిల్లుకు సెనేట్‌ ఆమోదం

Published Thu, May 21 2020 7:02 PM | Last Updated on Thu, May 21 2020 7:14 PM

Senate Passes Bill To Delist Chinese Companies From Exchanges - Sakshi

వాషింగ్టన్‌ : ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అలీబాబా, బైదూ ఇంక్‌ వంటి చైనా కంపెనీలను అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల నుంచి తొలగించేందుకు దారితీసే తీర్మానాన్ని అమెరికన్‌ సెనేట్‌ ఆమోదించింది. చైనా కంపెనీల డీలిస్టింగ్‌తో పాటు విదేశీ కంపెనీల ప్రాధాన్యతను తగ్గించేలా బిల్లును రూపొందించింది. చైనా కంపెనీల్లో అమెరికన్ల నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేలా కీలక బిల్లును ఆమోదింపచేసింది. రిపబ్లికన్‌, డెమొక్రాట్‌ సెనేటర్లు జాన్‌ కెన్నెడీ, క్రిస్‌ వాన్‌ హాలెన్‌ ప్రతిపాదించిన బిల్లును యూఎస్‌ సెనేట్‌ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. చైనా దిగ్గజ కంపెనీల్లో కోట్లాది డాలర్లను పెట్టుబడుల రూపంలో కుమ్మరించడం పట్ల చట్టసభ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పెన్షన్‌ ఫండ్‌లు, విద్యా సంస్ధల నిధులను సైతం ఆకర్షణీయ రాబడుల కోసం చైనా కంపెనీల్లో మదుపు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

విదేశీ కంపెనీలకు చెక్‌

చైనా కంపెనీలను టార్గెట్‌గా చేసుకున్న ఈ బిల్లులో పొందుపరిచిన అంశాలను చూస్తే..విదేశీ ప్రభుత్వ నియంత్రణలో పనిచేయడం​ లేదని కంపెనీలు స్పష్టం చేయని పక్షంలో వరుసగా మూడేళ్లు కంపెనీ ఆడిటింగ్‌ను పబ్లిక్‌ కంపెనీ అకౌంటింగ్‌ పర్యవేక్షక బోర్డు ఆడిట్‌ చేయకుండా, ఆయా కంపెనీల షేర్లను ఎక్స్ఛేంజ్‌ల నుంచి నిషేధించేలా ఈ బిల్లును రూపొందించారు. కాగా, నియమాలకు అనుగుణంగా చైనా నడుచుకోవాలని తాను కోరుకుంటున్నానని సెనేట్‌లో బిల్లును ప్రతిపాదిస్తూ కెన్నెడీ పేర్కొన్నారు. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్టయిన కంపెనీలన్నీ ఒకే ప్రమాణాలను కలిగిఉండాలని, ఈ బిల్లు ఆ ప్రమాణాలను తీసుకురావడంతో పాటు ఇన్వెస్టర్లు మెరుగైన నిర్ణయాలు తీసుకునేలా పారదర్శకత అందిస్తుందని మరో సెనేటర్‌ వాన్‌ హోలెన్‌ అన్నారు.

చదవండి : అమెరికా కీలక ముందడుగు

డ్రాగన్‌ కంపెనీలకు గడ్డుకాలం

చైనా కంపెనీలపై కొరడా ఝళిపించే బిల్లును తీసుకురావడంతో జాక్‌మాకు చెందిన యాంట్‌ ఫైనాన్షియల్‌ నుంచి సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన బైట్‌డ్యాన్స్‌ లిమిటెడ్‌ వంటి పలు చైనా కంపెనీల లిస్టింగ్‌ ప్రణాళికలకు విఘాతం కలిగింది. ఈ బిల్లుతో రానున్న రోజుల్లో అమెరికన్‌ స్టాక్‌ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్టయిన చైనా కంపెనీలన్నింటికీ ఇబ్బందులు తప్పవని బీజింగ్‌కు చెందిన స్టాక్‌మార్కెట్‌ నిపుణులు, పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ హల్క్స్‌ వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉన్న చైనా ఆడిటర్స్‌పైనా బిల్లు ప్రభావం చూపనుంది.ఇక అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతల నుంచి కరోనా మహమ్మారిపై ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా బెడిసికొట్టిన నేపథ్యంలో డ్రాగన్‌ కంపెనీలను టార్గెట్‌ చేస్తూ అగ్రరాజ్యం ఈ బిల్లును తీసుకురావడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement