సియోల్ : దక్షిణ కొరియా తదుపరి అధ్యక్ష పదవికి పోటీపడతారని భావిస్తున్న సియోల్ మేయర్ ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటూ బలవన్మరణానికి పాల్పడ్డారు. సియోల్ మేయర్ పార్క్ వాన్‌సూన్ మృతదేహాన్ని నగరానికి సమీపంలోని పర్వత ప్రాంతంపై కనుగొన్నారు. మీటూ ఆరోపణలతో వివిధ రంగాల ప్రముఖులపై బాధిత మహిళలు ఆరోపణలు గుప్పిస్తున్న క్రమంలో పార్క్ వాన్‌సూన్ విషాదాంతం చోటుచేసుకుంది. ఆయన అధికార నివాసంలో లభించిన సూసైడ్ నోట్‌లో ఈ ప్రపంచాన్ని వీడుతున్నందుకు అందరూ తనను క్షమించాలని రాసుకున్నారు. తన దహన సంస్కారాలు నిర్వహించి అస్తికలను తన తల్లితండ్రుల సమాధుల వద్ద చల్లాలని ఆయన కోరారు. తన కుటుంబాన్ని బాధపెట్టినందుకు కుటుంబ సభ్యులు తనను మన్నించాలని పార్క్ వాన్‌సూన్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావించకుండా బై ఎవిరివన్ అంటూ లేఖను ముగించారు.
దశాబ్ధ కాలంగా సియోల్ మేయర్‌గా కొనసాగుతున్న పార్క్ దక్షిణ కొరియా రాజకీయాల్లో, పాలక డెమొక్రటిక్ పార్టీలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. గతంలో తన కార్యదర్శిగా పనిచేసిన మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మరుసటి రోజే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా 2015లో పార్క్ వద్ద కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఆయన తనను లైంగిక వేధింపులకు గురిచేశారని పనివేళల్లో అభ్యంతరకరంగా ప్రవర్తించేవారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఆయన అండర్‌వేర్ ధరించి ఉన్న సెల్ఫీలను తనకు పంపి మెసెంజర్ యాప్‌లో అసభ్యకర కామెంట్లు చేసేవారని ఫిర్యాదు చేశారు. పార్క్ చర్యలతో తనకు విపరీతంగా భయం వేసేదని, సియోల్‌నగర ప్రజలు, నగర ప్రయోజనాల కోసం వాటిని భరించానని ఆమె పేర్కొన్నారు. మహిళ ఫిర్యాదును ధ్రువీకరించిన పోలీసులు వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. మరోవైపు పార్క్ మరణించడంతో ఆయనకు వ్యతిరేకంగా మహిళ చేసిన ఫిర్యాదులపై విచారణ సైతం ముగిసిపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment