పీఓకేలో కూలిన పాక్ సైనిక హెలికాప్టర్
ఇద్దరు విదేశీ రాయబారులు సహా ఏడుగురి మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం పాక్ సైనిక హెలికాప్టర్ కూలిపోవడంతో ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ఫిలిప్పీన్స్ రాయబారి లీఫ్ లార్సన్, నార్వే రాయబారి డొమింగో లూసెనారియో, మలేసియా, ఇండోనేసియా రాయబారుల భార్యలు, ఇద్దరు ఆర్మీ పెలైట్లు, సిబ్బంది ఒకరు ఉన్నారు. మలేసియా, పోలండ్, డచ్ రాయబారులు గాయపడ్డారు. ఆరుగురు పాకిస్తానీలు, 11 మంది విదేశీయులతో వెళ్తున్న ఈ హెలికాప్టర్ నల్తార్ లోయ ప్రాంతంలో అత్యవసరంగా దిగుతూ కూలిపోయిందని ప్రాథమిక సమాచారం.
హెలికాప్టర్ ఖాళీగా ఉన్న స్కూలుపై కూలడంతో ఆ భవనానికీ మంటలు అంటుకున్నాయి. హెలికాప్టర్‌ను క్షిపణితో తామే కూల్చామని, తమ లక్ష్యం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, అతని సహచరులు అని పాక్ తాలిబాన్ ఉగ్రవాదులు ప్రకటించారు. షరీఫ్ వేరే హెలికాప్టర్‌లో ఉండడంతో బతికి బయటపడ్డాడని పేర్కొన్నారు. అయితే పాక్ ఆర్మీ దీన్ని తోసిపుచ్చింది. హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ సాంకేతిక లోపంతోనే కూలిపోయిందని పేర్కొంది. నల్తార్‌కు వెళ్తున్న షరీఫ్ విమానాన్ని ఈ ఘటన నేపథ్యంలో దారి మళ్లించి ఇస్లామాబాద్‌కు తీసుకొచ్చామని పేర్కొంది. నల్తార్‌లో షరీఫ్ పాల్గొనాల్సిన కార్యక్రమం కోసం 37 దేశాలకు చెందిన దౌత్యవేత్తలను 3 హెలికాప్టర్లలో తీసుకెళ్తుండగా ఒకటి కూలిపోయిందని తెలిపింది. హెలికాప్టర్ 25 అడుగుల ఎత్తు నుంచి కూలిం దని పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ చెప్పారు.