షరీఫ్ భార్య.. ఘన విజయం
అవినీతి ఆరోపణలతో పదవీచిత్యుడు అయిన పాక్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీష్‌కు పెద్ద ఊరట
సాక్షి, లాహోర్: అవినీతి ఆరోపణలతో పదవీచిత్యుడు అయిన పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీష్‌కు పెద్ద ఊరట లభించింది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన నియోజక వర్గ ఉప ఎన్నికల్లో షరీఫ్ భార్య కుల్సుమ్ నవాజ్ ఘన విజయం సాధించారు.
ఆదివారం ఎన్‌ఏ-120 నియోజక వర్గానికి ఎన్నికలు నిర్వహించగా, అర్థరాత్రి తర్వాత ఫలితాలను వెల్లడించారు. షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్ తరపున పోటీ చేసిన కుల్సుమ్.. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ, బిలావల్ భుట్టో జర్దారీ లాంటి గట్టి పార్టీల అభ్యర్థులపైనే విజయం సాధించింది. పాక్ చరిత్రలోనే మొదటిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగించి ఈ ఎన్నికలను నిర్వహించారు. కుల్సుమ్‌కు 61, 254 ఓట్లు పోలవ్వవగా, 14,888 ఓట్ల తేడాతో ఆమె విక్టరీ సాధించారు. మొత్తం 3,20,000 ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నట్లు సమాచారం.
ఇక తన ముల్సుమ్ విజయంపై ఆమె కూతురు మర్‌యమ్ నవాజ్ స్పందిస్తూ.. ఇది మాములు విజయం కాదని.. ప్రజా తీర్పని అభివర్ణించారు. కాగా, ప్రస్తుతం ముల్సుమ్ లండన్‌లో కేన్సర్ చికిత్స తీసుకుంటుండగా, నవాజ్ షరీఫ్ ఆమె వెంటే ఉన్నారు. పనామా పేపర్ల లీకేజీతో షరీఫ్ బినామీ వ్యవహారాలు వెలుగులోకి రావటం.. పాకిస్థాన్ సుప్రీం కోర్టు తీర్పుతో ఆయన గద్దె దిగిపోవటం జరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను షరీఫ్ కుటుంబం ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, ఆయన కూతురు మర్‌యమ్ ప్రచార బాధ్యతలను మొత్తం తానే చూసుకున్నారు.