షేవింగ్, ట్రిమింగ్‌లు షరియా చట్టానికి విరుద్ధం..
ముజఫర్‌నగర్(ఉత్తరప్రదేశ్): గడ్డం తీయడం ఇస్లాం వ్యతిరేకమని ప్రముఖ ఇస్లామిక్ మత సంస్థ దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ ఫత్వా జారీచేసింది. దేవ్‌బంద్‌లోని ఓ సెలూన్ నడుపుతున్న మహమ్మద్ ఇర్షద్, మహమ్మద్ ఫర్ఖాన్ అనే వ్యక్తులు అడిగిన ప్రశ్నకు బదులుగా ఈమేరకు స్పష్టం చేసింది.
షేవింగ్, ట్రిమింగ్‌లు షరియా చట్టానికి విరుద్ధం కనుక అవి ఇస్లాం వ్యతిరేకమని ఫత్వా జారీ చేసిన దారుల్ ఇఫ్తా విభాగం పేర్కొంది. ‘ఏ మతానికి చెందిన వ్యక్తి గడ్డాన్నైనా గీయడానికి షరియా అనుమతించదు. ఈ వృత్తిలో ఉన్న వ్యక్తులు వేరే పనిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాలి’ అని ఫత్వాలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేవ్‌బంద్‌లోని చుట్టపక్కల ప్రాంతాల్లోని క్షురకులు షేవింగ్ చేయడం ఆపేసి, తమ షాపుల ముందు ఫత్వా కాపీని ప్రదర్శించారు.