మతం.. మానవత్వం.. ఫర్నిచర్
ఆక్లాండ్
మతం కన్నా మానవత్వం మిన్న అని నిరూపించాడో ఓ సిక్కు యువకుడు. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న బాలుడిని కాపాడేందుకు, మత నిబంధనను కూడా పక్కన బెట్టిన ఆ యువకుడి తీరు ప్రశంసలందుకుంది. అతడి చొరవను మెచ్చుకున్న స్థానిక టీవీ చానల్ ఒకటి.. ఓ ఫర్నిచర్ షాపు సహకారంతో.. అతడి అపార్టుమెంటులో కావల్సిన మొత్తం ఫర్నిచర్ అంతటినీ ఉచితంగా అందించింది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం..
22 ఏళ్ల హర్మన్ సింగ్ తన అపార్ట్మెంట్లో ఏదో పని చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఇంతలో రోడ్డు మీద కీచుమనే శబ్దంతో సడన్ బ్రేక్.. శబ్దం. మళ్లీ రయ్ మని దూసుకుపోయిన సౌండ్.. చిన్న పిల్లల అరుపులు, ఏడుపులు వినిపించాయి.
అంతే ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా పరుగెత్తుకుంటూ అక్కడకు చేరుకున్నాడు. అక్కతో కలిసి స్కూలుకు వెళ్తూ రోడ్డు దాటుతున్న ఐదేళ్ల పిల్లాడిని ఓ కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. తలకు దెబ్బ తగలడంతో విపరీతమైన రక్తస్రావంతో బాలుడు ప్రమాదకర స్థితిలో పడి ఉన్నాడు. ముందు ఆ రక్తస్రావాన్ని ఆపాలి. ఎలా.. ఇంకేమీ ఆలోచించలేదు.. తన తలపై ఉన్న తలపాగా తీసి బాబుకు కట్టుకట్టాడు. దీంతో చుట్టుపక్కల వారు అవాక్కయ్యారు.
''నేను మతం గురించి గానీ, మరే విషయం గురించి గానీ ఏమీ ఆలోచించలేదు.. ఎలాగైనా కారుతున్న రక్తాన్ని ఆపాలి. అంతే.. అందుకే ఆలా చేశాను'' అన్నాడు హర్మన్ సింగ్. తనకు చాలా ఆనందంగా ఉందని, ఇపుడు నాన్న ఉంటే చాలా సంతోషించేవారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో సింగ్పై ప్రశంసల జల్లు కురిసింది. మానవత్వానికి పెద్దపీట వేసినందుకు చాలా మంది సిక్కులు కూడా అతణ్ని అభినందనల్లో ముంచెత్తారు.