200మంది విద్యార్థులను పిట్టల్లా కాల్చారు!
సిరియా: ఉగ్రవాదుల కర్కశత్వానికి ఇది పరాకాష్ట. వారికి ఎంతటి రక్తదాహముంటుందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. వారికి దయ,కరుణ,జాలి అనేవి ఇసుమంతైనా ఉండవని చెప్పేందుకు ఒక సజీవ సాక్ష్యం. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎలాంటి బాంబు దాడులు తమపై జరుగుతాయో అనుకుంటూ బిక్కుబిక్కుమని తమ ఇళ్లలో ఉంటూ, పాఠాలను వల్లే వేస్తున్న చిన్నారులు, విద్యార్థులు,యువకులు వారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 200మంది. అందరిని వధశాలకు తరలించే పశువుల మాదిరిగానే ట్రక్కుల్లో తీసుకెళ్లి చేతికి కట్లుకట్టి వారి ముఖానికి బురద పూసి పిట్టలను కాల్చినట్లు కాల్చారు.
ఆ బుల్లెట్లకు వారి శరీరంలోని ప్రతి అవయవం నివాసంగా మారింది. ఆ నేల మరోసారి రక్తపురంగుపులుముకొని పచ్చిపుండై మూలిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల సిరియాలో పెట్రేగిపోయిన ఇస్లామిక్ ఉగ్రవాదులను అణిచివేసేందుకు ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, రష్యాతోపాటు ఇరాన్ వంటి దేశాలు కూడా సిరియా ప్రభుత్వానికి అండగా నిలిచాయి. ముష్కర ముఠా ఉన్న చోటల్లా పసిగట్టి ముప్పుతిప్పలు పెడుతున్నాయి. వారికి నిలవ నీడ లేకుండా చేయాలన్న కసితో ఉగ్రవాదులను తుదముట్టించే కార్యక్రమం ప్రారంభించాయి. దీంతో వారి మనసులో ఏమనిపించిందో ఏమో.. ఏకంగా తమ ఆధీనంలో ఉన్న ప్రాంతంలోని చిన్నారులను పశువుల మాదిరిగా ట్రక్కుల్లో టైగ్రీస్ నదీ తీరానికి తీసుకెళ్లారు. దాని వెంటే ఉన్న దుమ్మురేగుతున్న ఎర్రటి మట్టిలో వారందరిని బొర్లించి బొర్లించి కొట్టారు. ఆ పసివాళ్లు తమను విడిచిపెట్టండి.. తాము చేసిన ద్రోహం ఏమిటని బతిమిలాడుకున్నా ఆ కఠిన హృదయాలు కరగలేదు.
పైగా అలా బతిమిలాడిన ప్రతివారి ముఖంపై కాలిబూటితో తన్నారు. అనంతరం అందరి చేతులు కట్టివేసి నేలపై పడుకోబెట్టారు. అనంతరం వారి వెనుక ఏకే 47 తుపాకులు, చేతి రైఫిళ్లతో నిల్చున్నారు. మొత్తం పన్నెండు మంది మార్చిమార్చి వంతులు వేసుకొని ఇష్టమొచ్చిన చోటళ్లా కాల్చి చంపేశారు. మరికొంతమందిని నేరుగా తలపై షూట్ చేసి టైగ్రిస్ నదిలో పడేశారు. దీంతో ఆ నదీ రక్తపు వర్ణాన్ని అలుముకుంది. ఈ వీడియోను యెమెన్ కు చెందిన ఓ ఇస్లామిక్ స్టేట్ వ్యతిరేక కార్యకర్త ఇంటర్నెట్లో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా మాత్రం దీనికి ఇంకా ఎవరూ గుర్తించలేదు. గతంలో 1,700 మంది సైనికులను ఊచకోత కోసిన ఘటన తర్వాత ఇదే అతి పెద్ద ఘటన అని మాత్రం చెప్పవచ్చు.