సాక్షి, న్యూఢిల్లీ : రెండూ మూడేళ్ల క్రితం తప్పిపోయిన లేదా దూరమైన పిల్లవాడిని కలుసుకుంటే ఓ తల్లి హృదయం తన్మయత్వంతో పరవశించి పోతుంది. ఇక 68 ఏళ్ల క్రితం తన నుంచి దూరమైన కొడుకును కలసుకుంటే ఆ తల్లి హృదయం ఎలా ఉప్పొంగిపోతుందో చెప్పలేం! అది ఆ తల్లికే తెలియాలి. 68 ఏళ్ల క్రితం కొరియన్ల యుద్ధం కారణంగా ఉత్తర కొరియాలోనే ఉండిపోయిన తన కొడుకు లీ సంగ్ చుల్‌ను దక్షిణ కొరియాకు తరలిపోయిన తల్లి లీ కియమ్ సియంకు అదృష్టవశాత్తు లభించింది. ప్రస్తుతం 92 ఏళ్ల వయస్సు గల ఆ తల్లి 72 ఏళ్ల వయస్సు గల తన కొడుకును సోమవారం నాడు కలుసుకొంది. ఆ వృద్ధ తల్లి తన రెండు చేతులను ఆప్యాయంగా చాచగా, కొడుకు వచ్చి తల్లిని హత్తుకుంటాడు. తనతోనే ఉత్తర కొరియాలో ఉండిపోయి ఎప్పుడో చనిపోయిన తన తండ్రి ఫొటోను కూడా లీ సంగ్ ఈ సందర్భంగా తల్లికి చూపిస్తారు. ఆ ఫొటోను చూసిన తల్లికి పాత జ్ఞాపకాలతో కళ్లు చెమ్మగిల్లుతాయి.
ఈ తల్లీ తనయుల అరుదైన కలయికకు సంబంధించిన సన్నివేశాన్ని వీడియో తీసిన సీఎన్‌ఎన్ ఛానల్ దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కొరియన్ల యుద్ధం సందర్భంగా విడిపోయిన రక్త సంబంధీకులు తిరిగి కలుసుకున్న సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. అయితే గత మూడేళ్ల కాలంలో రక్త సంబంధీకులు ఇలా కలుసుకోవడం ఇదే తొలిసారి. దక్షిణ కొరియాలో 89 మంది వృద్ధులు ఇలా తమ పిల్లలను కలుసుకోవడం కోసం నిరీక్షిస్తున్నారు. వారిలో నుంచి లాటరీ పద్ధతి ద్వారా లీ కియమ్‌కు తనయుడిని కలుసుకునే అవకాశం లభించింది. అది గట్టి నిఘా మధ్యన. తల్లి కొడుకులు కలుసుకున్న ఆనందం కూడా వారికి ఎక్కువ సేపు ఉండదు. మూడు రోజుల్లో రోజుకు కొన్ని గంటలు మాత్రమే రక్తసంబంధీకులను కలుసుకునే అవకాశాన్ని దక్షిణ కొరియా కల్పిస్తోంది. ఆ తర్వాత దక్షిణ కొరియా పౌరులు తమ దేశానికి తరలిపోవాల్సిందే.
Published Fri, Aug 24 2018 6:01 PM | Last Updated on Fri, Aug 24 2018 6:09 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment