ట్రంప్ అమెరికా-ప్రపంచం
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత డొనాల్డ్ జె.ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఎలాంటి మార్పులొస్తాయి? లెఫ్టూ, రైటూ కాని ‘ట్రంప్’ మార్కు రాజకీయాలు ప్రపంచాన్ని ఎటు తీసుకెళతాయి? రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ విజయం సాధించారని నవంబర్8న ప్రకటించినప్పటి నుంచీ ప్రపంచ ప్రజలను ఈ ప్రశ్నలు పీడిస్తున్నాయి. ప్రజాస్వామ్య పరిరక్షణకు సరిగ్గా వందేళ్ల క్రితం (1917) మొదటి ప్రపంచ యద్ధంలో, తర్వాత (1941) రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన అమెరికాను, దాని ప్రజాతంత్ర, స్వేచ్ఛా వాణిజ్య సూత్రాలను ట్రంప్ ఓడిస్తారా? అనే ప్రశ్న కూడా ఎందరినో వేదిస్తోంది. ‘‘దక్షిణాన మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డగించడానికి సరిహద్దు గోడ నిర్మిస్తా! నేను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వరకూ ఇతర దేశాల నుంచి దేశంలోకి ముస్లింల రాకను నిషేధిస్తా. అమెరికా నుంచి బయటకు వెళ్లిన ముస్లింలను కూడా వారి నేపథ్యం గురించి రూఢి చేసుకోవడానికి ఆరు నెలలు దేశంలోకి ప్రవేశించకుండా చూస్తా!’’ వంటి అడ్డగోలు, వింత ప్రకటనలతో ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన ట్రంప్ ధోరణి ఓ పట్టాన చాలా మందికి అర్ధంకాలేదు.
పర్యావరణం వంటి అంశాలు, పాత మిత్రదేశాలు, సైద్ధాంతిక విభేదాలున్నా పరస్పర లబ్ధి కోసం స్నేహం చేస్తున్న చైనా వంటి దేశాలు, ఇరాన్, ఉత్తర కొరియా వంటి శత్రుదేశాలతో ప్రపంచ ఏకైక అగ్రరాజ్య అధినేతగా ట్రంప్ఎలా వ్యవహరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. పాతికేళ్ల క్రితం అగ్రరాజ్య హోదా కోల్పోయిన పాత శత్రువు రష్యా, 38 ఏళ్లుగా వాణిజ్య మైత్రి ఉన్న చైనా, మరో ఆసియా దిగ్గజం ఇండియాతో ట్రంప్అమెరికా ఎలాంటి సంబంధాలు కలిగి ఉంటుందనేది కూడా కీలకాంశం. రాజ్యాధికారం చెలాయించే విషయంలో, విదేశాంగ విధానంలో బొత్తిగా అనుభవం లేని కొత్త అధ్యక్షుడి వ్యవహారశైలిపై నిపుణులు, విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ట్రంప్కు విదేశాంగ విధానంపై సరైన అవగాహన లేదనే ఎక్కువ మంది భావిస్తారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ, అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ప్రధాన దేశాల ప్రభుత్వాలకు, నేతలకు ట్రంప్పంపిన సందేశాలను బట్టి చూస్తే ఈ అభిప్రాయంపై నమ్మకం కుదురుతుంది.
రష్యాతో పదేళ్లుగా అనుబంధం!
ప్రచ్ఛన్నయుద్ధ కాలంనాటి శత్రుదేశం రష్యాతో, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ట్రంప్కు మంచి సంబంధాలు పదేళ్ల నుంచే ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు అనుకూలంగా, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిలరీ క్లింటన్కు వ్యతిరేకంగా రష్యా గూఢచారసంస్థలు పనిచేశాయనేది కూడా బాగా ప్రచారంలోకి వచ్చిన విషయం. రష్యా నేత పుతిన్ సమర్ధుడనీ, గట్టిపిండమని ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్రంప్ తన అభ్యర్థిత్వం ట్విటర్లో చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసినవే. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ఒబామా మొదటి పదవీ కాలంలో రష్యాతో మెరుగైన సంబంధాలు కొద్ది కాలానికే దెబ్బతిన్నాయి. అప్పుడు విదేశాంగ మంత్రిగా ఉన్న హిలరీ పాత్ర దీనిలో ఉందని కూడా రష్యా సర్కారు భావించింది. అంతకు ముందు ఆమె భర్త బిల్ క్లింటన్ హయాంలో (19932001) కూడా రష్యాకు ఎక్కువ నష్టం జరిగే విధానాలను అమెరికా ప్రభుత్వం అనుసరించిందనే అభిప్రాయం పుతిన్కు ఉంది. ట్రంప్తో పుతిన్కు వ్యక్తిగత పరిచయంతోపాటు ఈ అంశాలు కూడా ట్రంప్ విజయాన్ని రష్యన్లు కోరుకోవడానికి కారణాలయ్యాయి. విదేశాంగమంత్రిగా హిలరీ అనుసరించిన దుందుడుకు విధానాల వల్ల అమెరికాకు రష్యా చాలా దూరమైంది. పాత ప్రచ్ఛన్నయుద్ధం నాటి శత్రుత్వం మళ్లీ తలెత్తడంతో పుతిన్ తన దేశంలో దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. బారెల్ ముడి చమురు ధర 2008 జులైలో 140 డాలర్లుండగా. అది ఆ తర్వాత వేగంగా 50 డాలర్ల దిగువకు పడిపోవడంతో దానిపైనే ఆధారపడిన రష్యా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి రష్యాను కాపాడడానికి ‘మంచి మిత్రుడి’గా సహకరిస్తారని భావిస్తున్న ట్రంప్ ఏ మేరకు పుతిన్కు మేలు చేస్తారో చూడాల్సి ఉంది.
పుతిన్ ఆప్తుడే అమెరికా విదేశాంగమంత్రి
అయిదో అతి పెద్ద అమెరికన్ఆయిల్ కంపెనీ ఎక్సాన్ మోబిల్ సీఈఓ రెక్స్ టిలర్ సన్ను విదేశాంగమంత్రి పదవికి ఎంపికచేయడం కూడా రష్యాకు దగ్గరవడానికి ట్రంప్ రూపొందించిన వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు. ఎక్సాన్ మోబిల్కు రష్యాలో కోట్లాది డాలర్ల భారీ పెట్టుబడులున్నాయి. అమెరికారష్యా బంధాన్ని బలోపేతం చేసినందుకు టిలర్ సన్కు ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్ షిప్ అవార్డును పుతిన్ సర్కారు ప్రదానం చేసింది. గత 8 ఏళ్లలో రష్యాతో దిగజారిన సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి టిలర్ సన్ను ట్రంప్ వాడుకుంటారని అంటున్నారు. టిలర్ సన్కు దౌత్యరంగంలో ఎలాంటి అనుభవం లేకున్నా పుతిన్తో ఉన్న స్నేహమే ఆయనకు కొండంత బలం. ఇప్పటి రష్యా పూర్వపు సోవియెట్ యూనియన్ మాదిరిగా బలమైన అగ్రరాజ్యం కాకున్నా పుతిన్ఇంకా ఆ భ్రమల నుంచి బయటపడలేదు. రష్యన్లను కూడా అవే భ్రమల్లో జీవించేలా చేయడంలో ఆయన సఫలమయ్యారు. వాస్తవానికి 2008 నాటి సంపదను రష్యాలో సృష్టిస్తే తప్ప పుతిన్ గట్టిగా నిలదొక్కుకోలేరు. ఈ విషయంలో ఒబామా, హిలరీ, జాన్ కెరీ హయాంలో లభించని సహకారం ట్రంప్ నుంచి దొరుకుతుందని పుతిన్ ఆశిస్తున్నారు.
(చదవండి : పుతిన్ చేతిలో ట్రంప్ జుట్టు?)
పుతిన్తో ‘డీల్’చేయడం కష్టమా?
సోవియెట్ కమ్యూనిస్ట్ పార్టీలో, తర్వాత గూఢచార సంస్థ కేజీబీలో లభించిన శిక్షణతో రాటుదేలిన పుతిన్తో అమెరికా తరఫున తెలివిగా వ్యవహారాలు నడపడం అంత సులువు కాదని కొందరు అమెరికా నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియా, ఐరోపా దేశాలు, నాటో దేశాల విషయంలో రష్యాతో ఎలా కలిసి పనిచేయాలనే విషయంలో ట్రంప్కు గట్టి అవగాహన ఉందని కొందరు చెబుతున్నారు. అగ్రరాజ్యం హోదా, బలం
కోల్పోయాక కూడా రష్యాను పాత సోవియెట్ యూనియన్లా పరిగణించి, అనవసర వైరంతో బిల్ క్లింటన్ నుంచి ఒబామా కాలం వరకూ అమెరికా ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్లే వాస్తవానికి పశ్చిమాసియాలో రష్యా పలుకుబడి పెరిగిందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ఇక అలాంటి పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా రష్యాతో ‘ఎంతలో ఉండాలో అంతలో ఉండే’ పరస్పర ప్రయోజనకర పాలసీని అనుసరించాలని నిపుణులు చెబుతున్నారు. సిరియా, టర్కీ, ఇరాక్ వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో రెండు దేశాల మధ్య సదవగాహన ఉంటుందని భావిస్తున్నారు.
వినియోగవస్తు తయారీ రంగంలో అమెరికా, రష్యాలు ఇంకా చేయడానికి చైనా ఏమి మిగల్చకపోవడంతోఆయుధాల ఉత్పత్తి రంగమే ఈ రెండు పెద్ద దేశాలను ఆర్థికంగా ఆదుకోవాలి. రెండూ ఆయుధాలు ఉత్పత్తిచేసి రెండు చేతులా అమ్ముకోవడానికి అనువైన రీతిలో ప్రపంచాన్ని నడిపించే ఆలోచనలో పడ్డాయంటున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా అక్రమ, అనుచిత జోక్యానికి ప్రతీకారంగా పదవీ విరమణ చేస్తున్న అధ్యక్షుడు ఒబామా డిసెంబర్ చివర్లో 35 మంది రష్యా దౌత్తవేత్తల బహిష్కరణతోపాటు ఆంక్షలు విధించారు. తర్వాత ఎన్నికల్లో రష్యా అక్రమ జోక్యం నిజమేనంటూన అమెరికా నిఘా, జాతీయ భద్రతా సంస్థల నివేదిక కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో రష్యాకు ఎలా ట్రంప్ స్నేహ హస్తం అందిస్తారనేది ప్రధాన సమస్య. అత్యంత సున్నితమైన ఈ విషయంలో రష్యాపై ఆంక్షలు ఉపసంహరిస్తే ఎన్నికల్లో రష్యా హ్యాకింగ్ ట్రంప్తో అవగాహనతోనే జరిగిందని వచ్చిన ఆరోపణలు నిజమేననే భావన కలుగుతుంది. అధ్యక్షుని విశ్వసనీయత దెబ్బదింటుంది. ఈ వ్యవహారంలో ట్రంప్ తొలి చర్యలే ఆయన తెలివితేటలకు పరీక్ష అవుతాయి.
రష్యా సాయంతో ట్రంప్ గెలిచారా?
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా సర్కారు జోక్యం చేసుకుందనేది అమెరికా ప్రభుత్వ ఆరోపణ. పుతిన్ ఆదేశాల మేరకే డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ ఈమెయిల్స్ను హ్యాక్ చేసి, ఇలా దొంగిలించిన సందేశాలను వికీలీక్స్ సహా అనేక సంస్థలకు పంపిణీ చేశారని కూడా ఇటీవల అమెరికా నిఘా సంస్థలు నిర్ధారించాయి. అంతేగాకుండా డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిలరీని ట్రంప్తో పోల్చిచూసినప్పుడు ఆమె హీనంగా కనిపించేలా రష్యా ప్రచార ఉద్యమం పకడ్బందీగా నిర్వహించిందని వార్తలొచ్చాయి. హిలరీ, ఒబామా, ఇంకా డెమొక్రాటిక్ నేతలు పుతిన్పై వేలెత్తి చూపారు. ప్రత్యక్షంగా హిలరీపై, అమెరికాపై ఈ సైబర్ దాడులకు పుతిన్ స్వయంగా ఆదేశించడం ద్వారా తమ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నారని ఈ నేతలు విరుచుకుపడ్డారు. ఈ విషయంపై అమెరికా నిరసనను పుతిన్కు తెలపడానికి ఒబామా స్వయంగా‘ రెడ్ ఫోన్’ను ఉపయోగించారు. ట్రంప్ మాత్రం డెమొక్రాట్లు ఓటమి బాధతో ఈ ఆరోపణలు చేస్తున్నారుగాని తన విజయంలో రష్యా హ్యాకింగ్ పాత్ర ఏమీ లేదని తేల్చిచెప్పారు.
అమెరికా ప్రజల్లో చాలా మంది హిలరీని నమ్మకపోవడం, కొన్ని కీలక రాష్ట్రాల్లో ఉపాధి కోల్పోయిన ప్రజలు ఆమెను ఓడించాలనే పట్టుదలతో ట్రంప్ను బలపరచడం వంటి ప్రధాన కారణాలున్నందున రష్యా హ్యాకింగ్ వల్లే హిలరీ ఓడారని నమ్మడానికి మీడియా, మేధావులు సిద్ధంగా లేరు. ఒక దేశం ఎన్నికల్లో మరో దేశం జోక్యం అనేది ఇది మొదటిదీ కాదు, చివరిదీ కాదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదట జోక్యం చేసుకుని, ఫలితాన్ని ప్రభావితం చేయాలనుకున్న దేశం ఫ్రాన్స్ అని ప్రసిద్ధ బ్రిటిష్ దినపత్రిక ‘గార్డియన్’ తన సంపాదకీయంలో తెలిపింది. 1796 అధ్యక్ష ఎన్నికల్లో ఫ్రాన్స్ పక్షపాతిగా పరిగణించిన డెమొక్రాటిక్ అభ్యర్థి థామస్ జెఫర్సన్ను గెలిపించడానికి అమెరికాలో ఫ్రాన్స్ రాయబారి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంగ్లండ్కు అనుకూలుడని భావించిన ఫెడరలిస్ట్ అభ్యర్థి జాన్ఆడమ్స్ నిలిచారు. రష్యా జోక్యంపై ఇంత గొడవ జరిగినా, దానికి జవాబుగా ట్విటర్లో,‘‘రష్యాతో సత్సంబంధాలుండడం మంచిదేగాని చెడేమీ కాదు. బుర్రతక్కువవాళ్లు, మూర్ఖులు మాత్రమే అది మంచిది కాదనుకుంటారు. ఎన్నికల ఫలితాన్ని హ్యాకింగ్ ప్రభావితం చేయలేదని ఇంటెలిజెన్స్ నివేదిక చెప్పింది.’’అంటూ ట్రంప్ చెప్పిన జవాబు చాలా మంది అమెరికన్లకు నచ్చినట్టు కనిపిస్తోంది.
చైనాకు చెక్ పెడతారా?
1978లో మొదలైన ఆర్థిక సంస్కరణలు, 20 శతాబ్దం ఆఖరులో వేగం పుంజుకున్న ప్రపంచీకరణ వల్ల ఆర్థికశక్తిగా ఎదిగిన చైనాను కట్టడిచేయాలనే ఆలోచన అమెరికాకు ఇటీవల వచ్చినా, రష్యాతో పెరిగిన శత్రుత్వం కారణంగా ఇది ఆచరణ సాధ్యంకాలేదు. రష్యాకు మిత్రుడనే ఇమేజ్తో వచ్చిన ట్రంప్ చైనాను అదుపు చేసే పని పూర్తిచేస్తారని దౌత్యనిపుణులు అంచనావేస్తున్నారు. అయితే, అందుకు పుతిన్కు ట్రంప్ ఎంతో కొంత మూల్యం చెల్లించకతప్పదు. తన కరెన్సీ యువాన్ విలువ తగ్గించడం నుంచి అనేక అంతర్జాతీయ వాణిజ్య విషయాల్లో చైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందనే చెడ్డపేరు తెచ్చుకుంది. బిల్ క్లింటన్, బరాక్ఒబామా హయాంలోనే చైనాను సైనికపరంగా, ఆర్థికంగా నిలువరించడం కుదరలేదు. ఈ విషయంలో పట్టుదలగా ఉన్న ట్రంప్కు రష్యా తోడ్పాటు అవసరం. అందుకే ఇక్కడ రష్యా అడిగినంత ఇచ్చి చైనా పనిపట్టడానికి ట్రంప్ వ్యూహాలు సిద్ధంచేసుకుంటున్నారు. అత్యధిక ప్రజానీకం ఉపయోగించే యాపిల్ ఉత్పత్తుల నుంచి వేలాది వినియోగ వస్తువులను చౌకగా తయారుచేసి అమెరికా మార్కెట్లను చైనా ముంచెత్తుతోంది. వందలాది అమెరికా, ఐరోపా కంపెనీలు చైనానే ఉత్పత్తి కేంద్రంగా చేసుకుని వ్యాపారం చేస్తున్నాయి. అమెరికాలో తయారీరంగం సైజు గణనీయంగా పడిపోయింది. మూతపడిన ఫ్యాక్టరీలున్న రాష్ట్రాల జనం ఓట్లతో గెలిచిన ట్రంప్కు కొన్ని కార్ఖానాలనైనా చైనా నుంచి వెనక్కి రప్పించాల్సిన అవసరం ఉంది. మరి అందుకు రష్యా సాయం ఎలా తీసుకుంటారో భవిష్యత్తులో తెలుస్తుంది.
అమెరికా ఫస్ట్ పేరిట!
అధ్యక్షపీఠంపై కూర్చున్నాక అగ్రరాజ్య హోదా ఉన్నప్పటికీ అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తానని, మిత్రదేశాల కోసం అనవసర త్యాగాలు చేయనని ట్రంప్ ఎన్నికల ప్రచారం సందర్భంగా వాగ్దానం చేశారు. ప్రచ్ఛన్నయుద్ధకాలంలో తన శిబిరంలోని దేశాల కోసం ఎంతో వెచ్చించిన సోవియెట్ యూనియన్ కుప్పకూలింది. తర్వాత ప్రపంచీకరణ, రష్యాతో పోటీ కారణంగా అమెరికా కూడా మిత్రదేశాల కోసం ఖర్చుచేసి
నష్టపోయింది. అందుకే అనవసరంగా ఇతర చోట్ల తలెత్తే వివాదాల్లో అమెరికా వేలు పెట్టదని ప్రకటించారు. అధ్యక్షునిగా గెలిచాక తైవాన్ ప్రధాని త్సాయ్ ఇంగ్ వెన్కు ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఒక చైనా విధానానికే అమెరికా కట్టుబడాలంటూ చైనా నిరసన తెలిపినా ఆయన పట్టించుకోలేదు. చైనా నుంచి దిగుమతులు తగ్గించడానికి పన్నులు, సుంకాలు భారీగా వేస్తానని కూడా హెచ్చరించారు.
చైనాతో అమెరికా వైరం భారత్కు ఎంత లాభం?
అమెరికా ఫస్ట్ అనే స్వీయ ప్రయోజన సిద్ధాంతం అమల్లోకి వస్తే దక్షిణ చైనా సముద్రం వివాదంలో తమకు లాభదాయకంగా ఉంటుందని చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, చైనాతో ఘర్షణకు దిగడానికే సిద్ధపడితే, అది భారత్కు అనుకూలంగా మారుతుంది. ఇందులో ప్రమాదం ఏమంటే, రెండు ఆసియా దిగ్గజాల మధ్య కొత్త ప్రచ్ఛన్నయుద్ధం మొదలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. పాకిస్థాన్కు ట్రంప్ సర్కారు గతంలో మాదిరిగా భారీగా నిధులు అందించి భారత్ను ఇబ్బంది పెట్టేకపోవచ్చనే భావిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భారత్ అమెరికాకు చేసే సేవల ఎగుమతులు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి భారత ఐటీ దిగ్గాజాలకు ట్రంప్ విధానాల వల్ల ఆదాయం తగ్గిపోతుంది. హెచ్బీ వీసాల జారీపై ఆంక్షలు అమలు చేస్తే దేశంలోని సాఫ్ట్వేర్ నిపుణులకు అమెరికాలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. ఫోర్డ్ వంటి ఆటోమొబైల్ కంపెనీలను కూడా అమెరికాలోనే తయారుచేయాలనే నిబంధన ద్వారా ఒత్తిడి చేస్తే, భారత్లో ఇలాంటి కంపెనీల ప్లాంట్లు మూతబడతాయి. ఈ విషయాల్లో ట్రంప్ చెప్పే మాటలు ఎంత వరకు ఆచరణసాధ్యమో తేలాకే కొత్త అధ్యక్షుడి విధానాలు భారత్కు నిజంగా కీడుచేసేదీ లేనిదీ తేలుతుంది.
సత్సంబంధాల దశాబ్దం 1981-91
శత్రుత్వం నీడలో నడిచిన అగ్రరాజ్యాలు అమెరికా, సోవియెట్ యూనియన్(రష్యా పాత పేరు) మధ్య సంబంధాలు 1981-91 మధ్య ఎవరూ ఊహించని రీతిలో మెరుగుపడ్డాయి. ఈ దశాబ్దం చివరికి స్వీయ తప్పిదాలు, పాశ్చాత్య దేశాల ఎత్తుగడల వల్ల సోవియెట్ యూనియన్ కుప్పకూలి, ప్రచ్ఛన్నయుద్ధం ముగిసింది. 1981 జనవరిలో అధికారం చేపట్టిన మరో రిపబ్లికన్, పచ్చి కమ్యూనిస్ట్ వ్యతిరేకి రోనాల్డ్ రేగన్ హయాంలో రెండు దేశాల మధ్య సత్సంబందాలు నెలకొంటాయని ఎవరూ ఆశించలేదు. అఫ్ఘానిస్తాన్ వంటి సమస్యల కారణంగా ఆరంభంలో ఉద్రిక్తతలు పెరిగాయి. రేగన్ మొదటి పదవీకాలమంతా వేడివేడిగా నడిచింది. మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాలను చరిత్రలో ‘అస్తికల కుప్ప’గా మార్చేస్తానని రీగన్ ఒకానొక సందర్భంలో అన్నారు. అంతేకాదు, ఈ కమ్యూనిస్టు అగ్రదేశాన్ని ‘దుష్ట సామ్రాజ్యం’గా ఆయన అభివర్ణించారు. 1983లో దక్షిణ కొరియా (కొరియా ఎయిర్ లైన్స్ ప్రయాణికుల ఫ్లైట్)విమానాన్ని జపాన్ సముద్రంలో సోవియెట్ దళాలు కూల్చివేశాక ఎప్పుడూ లేనంతగా రెండు అగ్రరాజ్యాల మధ్య సంబంధాలు దెబ్బదిన్నాయి.
సోవియెట్ రాజ్యాన్ని అదుపుచేయడానికి రేగన్ వెంటనే ‘స్టార్వార్స్’ కార్యక్రమం ప్రకటించారు. 1985 మార్చిలో సోవియెట్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో దేశాధినేతగా మిహాయిల్ గోర్బచేవ్ అధికారం చేపట్టాక రెండు దేశాల మధ్య సంబంధాల్లో స్వర్ణయుగం వచ్చింది. 1987 డిసెంబర్లో రేగన్, గోర్బచేవ్ రెండు దేశాల అణుక్షిపణుల తొలగింపు ఒప్పందంపై సంతకాలు చేశారు.మరుసటి ఏడాది మే నెల్లో సోవియెట్ పర్యటనకు వచ్చిన రేగన్ మాస్కో రెడ్ స్వ్కేర్లో నిలబడి, దుష్ట సామ్రాజ్యం అనేది ఈ యుగానికి సంబంధించినది కాదని మాటమార్చి సోవియెట్ నేతలను ఆనందింపజేశారు. రేగన్ తర్వాత అధ్యక్షుడైన జార్జి హెచ్ డబ్ల్యూ బుష్(సీనియర్ బుష్) మొదట కాస్త వేడిపుట్టించినా చివరికి గోర్బచేవ్తో శాంతి పునరుద్ధరణకే చేతులు కలిపారు. 1989 డిసెంబర్లో(బెర్లిన్ గోడ కూలిన నెలకు) మధ్యధరాసముద్రదేశం మాల్టాలో గోర్బచేవ్, బుష్ భేటీ అయ్యారు. సమావేశం ముగిశాక,‘‘మేం ప్రచ్ఛన్నయుద్ధాన్ని మధ్యధరాసముద్ర గర్భంలో సమాధి చేశాం’’అని గోర్బచేవ్ ప్రతినిధి ప్రకటించారు.
క్లింటన్ - ఎల్త్సిన్ బంధం చెడింది
సోవియెట్ యూనియన్ అంతర్దానమయ్యాక అమెరికా అధ్యక్షుడైన బిల్ క్లింటన్కు, సోవియెట్ అధ్యక్షుడు బోరిస్ ఎల్త్సిన్కు మధ్య కొద్దికాలం సాగిన బంధం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. జూనియర్ బుష్ హయాంలో 2001 సెప్టెంబర్11 ఉగ్ర దాడుల తర్వాత అమెరికాతో సహకరిస్తానన్న పుతిన్ పొరుగుదేశం జార్జియాను ఆక్రమించి శత్రుత్వం పెంచుకున్నారు. 2009లో అధ్యక్షుడైన బరాక్ఒబామా రష్యాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. క్రిమియా, ఉక్రెయిన్, సిరియా సమస్యలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. చివరికి ఆయన రష్యాపై ఆంక్షలు విధించి పదవీ విరమణ చేస్తున్నారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాల పునరుద్ధరణకు ఇంత మంది అమెరికా అధ్యక్షుల కృషి ఫలించలేదు. మరి ట్రంప్ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో కాలమే చెబుతుంది.
రష్యన్లకు అంత ‘ఆశ’ లేదు: అమెరికా నిపుణుడు థామస్ గ్రహమ్
‘‘ట్రంప్ ప్రమాణం రోజే సంబంధాలు బలపడతాయని రష్యన్లు ఆశించడంలేదు. చాలా త్వరగా స్నేహబంధం గట్టిపడుతుందని వారనుకోవడం లేదు. ట్రంప్ రష్యన్లకు అడిగినవన్నీ ఇస్తారనే పాశ్చాత్య దేశాల(ఐరోపా) అంచనాలను చూసి రష్యన్లు ఆశ్చర్యపోతున్నారు.’’అని జార్జి డబ్ల్యూ బుష్సలహాదారుగా పనిచేసిన థామస్ గ్రహమ్ అభిప్రాయడ్డారు. ‘‘విదేశాంగ నీతిలో ఏమాత్రం అనుభవం లేకున్నా ట్రంప్ తనకు లాభదాయకమైన ఒప్పందాలనే కుదుర్చుకున్నారనీ, ఆయన బృదంలో అనుభవమున్న సలహాదారులున్నారని రష్యా సర్కారు భావిస్తోంది’’ అని ప్రస్తుతం విదేశాంగ విధానంలో సలహాలిచ్చే సంస్థ కిసింజర్ అసోసియేట్స్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న గ్రహమ్ చెప్పారు.