నేనొస్తే ధ్వంసం చేస్తా: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ముందువరుసలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే పలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుపోతున్న ఆయన ఏమాత్రం తన వాగ్దాడిని తగ్గించడం లేదు. అంతకంటే వేగంగా ఆయన మాటలు జారవిడుస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే విదేశాంగ విధానంలో తన తొలి ప్రాధాన్యం ఇరాన్ అణుఒప్పందం అంశమే ఉంటుందని, ఆ ఒప్పందాన్ని ధ్వంసం చేస్తానని అన్నారు.
వాషింగ్టన్లో నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందే ప్రపంచ ఉగ్రవాద నెట్ వర్క్కు టెహ్రాన్ మాత్రమే కీలక స్థావరంగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను ఎంతో కాలంగా వ్యాపార రంగంలో ఉన్నానని, ఒప్పందాన్ని ఎలా చేసుకుంటారో తనకు తెలుసని అన్నారు. ఇరాన్ తో జరిగిన అణుఒప్పందం ఒక దురదృష్టకరం అని చెప్పారు. ఈ ఒప్పందాన్ని తాను విచ్ఛిన్నం చేస్తానని ప్రకటించారు.