మసాలాల మాటున మాదక ద్రవ్యాలు!
అబుధబిః మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠా గుట్టును అబుధబి పోలీసులు రట్టు చేశారు. మసాలా దినుసుల మాటున మాదకద్రవ్యాలను ఎగుమతి చేస్తున్న ముగ్గురు మహిళలతో సహా 8 మంది నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. మసాలాల పేరుతో మాదక ద్రవ్యాలు కలిగిన 398 సంచులను వారివద్దనుంచీ స్వాధీనం చేసుకున్నారు.
ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో కూడిన మొత్తం ఎనిమిది సభ్యులతో కూడిన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాను అబుధబి పోలీసులు పట్టుకున్నారు. మసాలా దినుసులు, సంప్రదాయ ఔషధాల పేరున ముఠా... మాదక ద్రవ్యాల రవాణా జరుపుతున్నట్లు సిఐడీ డైరెక్టర్ డాక్టర్ రషీద్ మొహమ్మద్ తెలిపారు. ముఠాలోని సభ్యులంతా ఇంచుమించుగా 21-28 సంవత్సరాల మధ్య వయస్కులేనన్న పోలీసులు, సుమారు 25 లక్షల రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలు వారి అధీనంలో ఉన్నట్లు గుర్తించారు.
అదుపులోకి తీసుకున్న నిందితులపై అక్రమ రవాణా, మత్తు పదార్థాల విక్రయం తదితర కేసులను నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన వారిలో అరబ్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు, ముగ్గురు యూరోపియన్లు, వివిధ దేశాలకు చెందిన ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.