ప్రతి స్మార్ట్‌ఫోన్‌పైనా నిఘా నేత్రం | spy technlology can reveal your smartphone information | Sakshi
Sakshi News home page

ప్రతి స్మార్ట్‌ఫోన్‌పైనా నిఘా నేత్రం

Published Tue, Sep 6 2016 2:38 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

ప్రతి స్మార్ట్‌ఫోన్‌పైనా నిఘా నేత్రం

ప్రతి స్మార్ట్‌ఫోన్‌పైనా నిఘా నేత్రం

అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక మనకు మరింత ప్రైవసీ ఉంటుందని అనుకుంటున్నాం. మనం ఎక్కడున్నామో, ఎవరితో ఫోన్లో ఏం మాట్లాడుతున్నామో మూడో వ్యక్తికి తెలియదని భావిస్తున్నాం. కానీ అది భ్రమ మాత్రమే. నిరంతరం మన కదలికలపై, మనం మాట్లాడే ప్రతి మాటపై, పంపే ప్రతి సందేశంపై, తీసే ప్రతి ఫొటోపై నిఘానేత్రం కొనసాగుతూనే ఉంటోంది. మూడో కన్ను చూస్తూనే ఉంటోంది. మన కదలికలను ఎప్పటికప్పుడు గమనించేందుకు మన వెన్నంటి గూఢచారులు ఎవరూ రాకపోవచ్చు. మనకు తెలియకుండానే  మన ఫోన్‌లోనే ఆ నిఘా వ్యవస్థ మనల్ని వెంటాడుతోంది.

దీనికి ఏ ఫోనూ అతీతం కాదు. ఐఫోన్లు, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, సింబియాన్‌ వ్యవస్థ ఫోన్లన్నీ నిఘా పరిధిలోనే పనిచేస్తున్నాయి! మన ఫోన్‌లోని ఈ మెయిళ్లు, టెక్స్ట్ సందేశాలు, కాంటాక్ట్‌ జాబితాలు, క్యాలెండర్‌ రికార్డ్స్, ఇన్‌స్టెంట్‌ మెసేజిలు, జీపీఎస్‌ లొకేషన్, సెర్చ్‌ హిస్టరీ తదితరాలన్నీ మూడో వ్యక్తికి రియల్‌ టైమ్‌లోనే తెలిసిపోతోంది. మనం మాట్లాడుతున్నప్పుడు పరిసరాల ప్రాంతాల నుంచి వినిపించే శబ్దాలను కూడా మన ఫోన్‌లోని మైక్రోఫోనే రికార్డుచేసి మూడో వ్యక్తికి పంపిస్తుంది.

ఈ నిఘా వ్యవస్థను ప్రైవేటు కంపెనీలే ఎక్కువగా నిర్వహిస్తున్నాయి. అందులో ప్రముఖమైనది  'ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌'. ఇది ఇజ్రాయెల్‌లో 2010లో ఏర్పాటయింది. ఇందులో దాదాపు 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏడాదికి 15 కోట్ల డాలర్ల ఆదాయం వస్తోంది. వివిధ దేశాల ప్రభుత్వాలు, దర్యాప్తు సంస్థలు, ప్రైవేటు సంస్థలు సూచించే ఏ ఫోన్ల మీద నిఘా కావాలంటే వాటిపై నిఘా పెట్టడమే ఈ సంస్థ వ్యాపారం. అందులో భాగంగా వివిధ టారిఫ్‌ల ప్రకారంగా ఫీజులు వసూలు చేస్తోంది.

పది ఐఫోన్లపై నిఘా కొనసాగించేందుకు ఐదు లక్షల డాలర్లు, పది ఆండ్రాయిడ్‌ ఫోన్లపై నిఘాకు ఆరున్నర లక్షల డాలర్లు, ఐదు బ్లాక్‌బెర్రీ ఫోన్లపై నిఘాకు ఐదు లక్షల డాలర్లు, ఐదు సింబియాన్‌ ఫోన్లపై  నిఘాకు మూడు లక్షల డాలర్లను ఈ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ పీజు కింద వసూలు చేస్తోంది. ఆ తర్వాత ప్రతి వంద పీసులపై 8 లక్షల డాలర్లు, ప్రతి 50 పీస్‌లపై 5 లక్షల డాలర్లు, ప్రతి 20 పీసులపై రెండున్నర లక్షల  డాలర్లు, ప్రతి పది పీసులపై ఒకటిన్నర లక్షల డాలర్లను వసూలు చేస్తోంది.

మొబైల్‌ ఫోన్లను ట్రాక్‌ చేయడం కోసం ఈ కంపెనీ ఎప్పటికప్పుడు ట్రాకింగ్‌ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ను తయారుచేస్తోంది. దీన్ని వినియోగదారుల ఫోన్లలోకి ఎక్కించేందుకు అనేక మార్గాలు అనుసరిస్తోంది. పాతకాలపు డిటెక్టివ్‌ల మాదిరిగా మనుషులను మన వద్దకు పంపించి మన  ఫోన్లను ట్రాక్‌ చేస్తారు. ఈ మెయిళ్ల ద్వారా, వెబ్‌ సెర్చింగ్‌ ద్వారా, ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌ ద్వారా మన స్మార్ట్‌ఫోన్‌లోకి నిఘా వ్యవస్థను ఎక్కిస్తారు. ఈ సంస్థ చుట్టుపక్కల నుంచి వచ్చే శబ్దాలను కూడా రికార్డు చేసేందుకు 'రూమ్‌ ట్యాప్‌' టెక్నాలజీని కూడా రూపొందించింది. అందుకోసం ప్రభుత్వాల నుంచి, ప్రభుత్వ నిఘాసంస్థల నుంచి, ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థల నుంచి కాంట్రాక్టులు తీసుకుంటారు. మెక్సికో ప్రభుత్వం తరఫున మూడేళ్లపాటు మూడు కాంట్రాక్టులను కుదుర్చుకోవడం ద్వారా ఈ  సంస్థ 1.50 కోట్ల డాలర్ల ఆదాయాన్ని సంపాదించింది.

ఇలా పౌరుల స్మార్ట్‌ఫోన్లపై నిఘా కొనసాగించడం ఏ మాత్రం అనైతికం కాదని కంపెనీ ప్రతినిధులు వాదిస్తున్నారు. ఇజ్రాయెల్‌ చట్టాల ప్రకారమే తమ కంపెనీ ఏర్పాటైందని, తమ కంపెనీలో కూడా పదిమంది ఉద్యోగులతో నైతిక విలువల కమిటీ ఒకటి ఉందని వారు తెలిపారు. ప్రపంచబ్యాంకు, ఐక్యరాజ్యసమితి సూచించిన నైతిక ప్రమాణాలను తమ నైతిక విలువల కమిటీ అనుసరిస్తున్నదని వారు చెప్పారు. ప్రపంచంలో టెర్రరిజాన్ని, డ్రగ్‌ మాఫియాను అరికట్టడం తమ లక్ష్యమని కూడా పేర్కొన్నారు. టెర్రరిస్టు సంస్థలపైనో, డ్రగ్‌ మాఫియా సంస్థలపైనో కాకుండా జర్నలిస్ట్‌లపైనా, సామాజిక  కార్యకర్తలపైనా, ఎన్జీవో సంస్థలపై నిఘా కొనసాగించిన సంఘటనలు కూడా ఉన్నాయి. వివిధ దేశాల ప్రభుత్వాలతో కాంట్రాక్టులు కుదుర్చుకొని వారికి కావాల్సిన నిఘా సమాచారాన్ని అందిస్తోందని, అలాంటప్పుడు ఆ ప్రభుత్వాలే ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని మానవ హక్కుల సంస్థలు విమర్శిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement