కొలంబో: వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లుతోంది. ఆదివారం ఆరు గంటల వ్యవధిలో ఎనిమిది చోట్ల జరిగిన పేలుళ్లలో 160 మందికి పైగా మరణించగా, 400 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. అయితే శ్రీలంకలో ఆత్మహుతి దాడులకు సంబంధించి పది రోజుల ముందుగానే ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారులుకు సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. ‘నేషనల్ తోహీత్ జమాత్(ఎన్టీజే)’ సంస్థ శ్రీలంకలో ఆత్మహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఓ విదేశీ నిఘా సంస్థ హెచ్చరించిననట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు శ్రీలంక పోలీసు చీఫ్ పుజత్ జయసుందర ఏప్రిల్ 11వ తేదీన ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. ప్రముఖ చర్చిలు, కొలంబోలోని భారత హై కమిషనర్ కార్యాలయం లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా అందులో పేర్కొన్నారు. కాగా, గతేడాది బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనతో ఎన్టీజే రాడికల్ ముస్లిం వర్గానికి సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
చదవండి: బాంబు పేలుళ్లతో రక‍్తమోడుతున్న కొలంబో
ఈస్టర్ పర్వదినాన చర్చిలకు వచ్చే విదేశీ యాత్రికులే లక్ష్యంగా దాడులు జరిగనట్టుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో మరణించినవారిలో 35 మంది విదేశీయులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పేలుళ్ల ఘటన అనంతరం శ్రీలంకలో ఎమర్జెన్సీ సర్వీసులు రంగంలోకి దిగాయి. శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన అధికారులు.. కొలంబోలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మరోవైపు కొలంబోలో వరుస పేలుళ్ల ఘటనను శ్రీలంక ప్రధాని విక్రమసింఘే తీవ్రంగా ఖండించారు. వదంతులను నమ్మరాదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment