కొలంబో : దేశంలో లింగవివక్షను తగ్గించడానికంటూ శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సర్వత్రా విమర్శలపాలయ్యాయి. మగవారిలాగే 18 ఏళ్లు నిండిన ఆడవారు కూడా స్వేచ్ఛగా మద్యం కొనుక్కోవచ్చని లంక సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ 24 గంటలు తిరక్కముందే దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తన విశిష్టఅధికారాలను ఉపయోగించి సదరు ఉత్తర్వులను రద్దుచేశారు. దీంతో నిరసనకారులు మరోసారి భగ్గుమన్నారు.
ఏమిటి వివాదం?: బ్రిటిష్ పాలన నుంచి విముక్తిపొందిన శ్రీలంక 1948, ఫిబ్రవరి 4న స్వసంత్రదేశంగా అవతరించిన సంగతి తెలిసిందే. 1955 నాటి చట్టాల ప్రకారం అక్కడి మహిళలు మద్యం కొనుగోలుచేయడం నిషిద్ధం. దశాబ్ధాలుగా కొనసాగుతోన్న ఈ నిషేధానికి వ్యతిరేకంగా నిరసనగళాలు లేచాయి. మహిళకు మాత్రమే మద్యం నిషేధమనడం లింగవివక్ష కిందికే వస్తుందనే వాదన క్రమంగా బలపడింది. ఏళ్లుగా నానుతోన్న ఈ సమస్యకు పరిష్కారంగా శ్రీలంక పార్లమెంట్ ఇటీవలే.. పాత చట్టాన్ని కొట్టివేస్తూ కొత్త బిల్లును తీసుకొచ్చింది. లింగవివక్ష రూపుమాపేందుకేనని చెబుతూ ఆ చట్టం ప్రకారం మద్యం కొనుక్కునే స్వేచ్ఛతోపాటు, బార్లు, మద్యం అమ్మాకాలు జరిగే ఇతర చోట్లా ఉద్యోగాలు చేసుకునే అవకాశం మహిళలకు కల్పించారు. అంతేకాదు, మద్యం అమ్మకాల వేళల్ని ఉదయం9 నుంచి రాత్రి 9కి కాకుండా ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు మార్పు చేశారు.
అలా చేస్తే కుటుంబ వ్యవస్థ ఏంగాను? : కాగా, పార్లమెంట్ తీసుకొచ్చిన ‘నిషేధం ఎత్తివేత ఉత్తర్వు’లను దేశాధ్యక్షుడు మైత్రిపాల సినిసేన తన విశిష్ట అధికారాలను ఉపయోగించి రద్దుచేశారు. బౌద్ధమత గురువులు కూడా తొలినుంచీ ఈ నిషేధాన్ని సమర్థిస్తూనేఉన్నారు. మహిళలకు ఆ స్వేచ్ఛ కల్పిస్తే కుటుంబ వ్యవస్థ కుప్పకూలుతుందని మతాచారుల వాదన. అధ్యక్షుడు కాకమునుపు సిరిసేన సైతం మద్యవ్యతిరేక ఆందోళనల్లో భాగంపంచుకున్న చరిత్ర ఉంది. మొత్తానికి అధ్యక్షుడి నిర్ణయంపై నిరసనకారులతోపాటు కొందరు పార్లమెంట్ సభ్యులు కూడా గుర్రుగాఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment