కలిసికట్టుగా తీవ్రవాదుల అంతు చూద్దాం!
కొలంబో: సమాజానికి చీడలా దాపరించిన తీవ్రవాదాన్ని ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా అంతం చేద్దామని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాలా సిరిసేనా బుధవారం పిలుపు నిచ్చారు. మంగళవారం బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో తీవ్రవాదులు దృశ్చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడులపై స్పందించిన సిరిసేనా.. బెల్జియం కింగ్ ఫిలిప్కు సానుభూతిని ప్రకటిస్తూ లేఖ రాశారు. దాదాపు మూడు దశబ్దాలుగా క్రూరమైన తీవ్రవాదం కారణంగా తమ దేశం కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని చెప్పుకొచ్చారు.
ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవడంలో తమ దేశం నుంచి పూర్తి సహకారం ఉంటుందని సిరిసేనా స్పష్టం చేశారు. తీవ్రవాదులు ఇలాంటి క్రూరమైన చర్యలకు పాల్పడటంపై యావత్ ప్రపంచం ఖండించదగిన విషయంగా పేర్కొన్నారు. అన్ని రకాల తీవ్రవాదం నిర్మూలనకై సమిష్టిగా ప్రపంచ దేశాలన్నీ చర్యలు తీసుకోవాల్సిన అత్యవసరం ఎంతైనా ఉందని మనకు ఈ ఘటన సూచిస్తుందని సిరిసేనా హితవు పలికారు. కాగా, బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో తీవ్రవాదులిద్దరూ ఆత్మాహుతి దాడులకు పాల్పడటంతో 30మందికి పైగా దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.