శ్రీ శ్రీ రవిశంకర్ కు బ్రిటన్ లో ప్రత్యేక గౌరవం!
ఆధ్యాత్మిక సేవా రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గురు శ్రీ శ్రీ రవిశంకర్ కు బ్రిటన్ లో అరుదైన గౌరవం దక్కింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 37 కోట్లమంది ప్రజలకు చేరువైన ఆయన్ను ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు వరించగా ప్రస్తుతం బ్రిటన్ లోని నేషనల్ ఇండియన్ విద్యార్థులు, పూర్వ విద్యార్థి యూనియన్ ప్రత్యేక హానరరీ ఫెలోషిప్ ను అందించి సత్కరించింది.
హింసలేని సమాజాన్ని సృష్టించడంకోసం, ప్రపంచశాంతికోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్న గురు శ్రీ శ్రీ రవిశంకర్ కు బ్రిటన్ లోని నేషనల్ ఇండియన్ విద్యార్థులు, పూర్వ విద్యార్థి సంఘం (ఎన్ఐఎస్ఏయు) ప్రత్యేక గౌరవాన్ని అందించింది. ప్రపంచవ్యాప్తంగా యోగా, మెడిటేషన్, ఆధ్యాత్మిక విద్యను అభివృద్ధి పరచేందుకు కృష్టి చేస్తున్నందుకు గాను ఆయనకు ఈ ప్రత్యేక సత్కారాన్ని అందించినట్లు ఎన్ఐఎస్ఏయు ఓ ప్రకటనలో తెలిపింది. రవిశంకర్ కృషి ప్రపంచ శాంతికి మరింత సహకరించాలని ఈ సందర్భంగా విద్యార్థులు కోరారు.
వసుదైక కుటుంబం, సత్యమేవ జయతే అన్న సూత్రంతో, ప్రపంచదేశాలను ఒకే కుటుంబంగా మార్చాలన్న శ్రీ శ్రీ అసాధారణ ప్రయత్నాన్ని అక్కడి విద్యార్థులు కొనియాడుతున్నారు. ఆయనకు ప్రత్యేక గౌరవాన్ని అందిస్తూ.. అదే మార్గంలో మరింత అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా యువత శ్రీ శ్రీ రవిశంకర్ మార్గదర్శకత్వంలో నడవాలని బ్రిటన్ లో నివసిస్తున్న భారత విద్యార్థులంతా ఆశిస్తున్నట్లు ఎన్ ఐ ఎస్ ఏ యు అధ్యక్షుడు సనం ఆరోరా తెలిపారు.