సెయింట్లుగా ఇద్దరు కేరళీయులు
- ఫాదర్ చవర, సిస్టర్ యూఫ్రేసియాలకు సెయింట్‌హుడ్ ప్రకటించిన పోప్
- క్రైస్తవ మతపెద్దలు, భక్తుల హర్షం
- కేరళలో పెద్ద ఎత్తున సంబరాలు
వాటికన్ సిటీ: కేరళ లోని తిరువనంతపురంలో గల పురాతన సైరో మలబార్ చర్చికి చెందిన ఫాదర్ కురియకోస్ ఎలియాస్ చవర, సిస్టర్ యూఫ్రేసియాలను పోప్ ఫ్రాన్సిస్ సెయింట్లుగా ప్రకటించారు. ఆదివారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద అట్టహాసంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీరిద్దరికీ సెయింట్‌హుడ్ హోదానిస్తూ పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన చేశారు. ఇటలీకి చెందిన మరో నలుగురికీ ఈ కార్యక్రమంలో సెయింట్‌హుడ్‌ను పోప్ ప్రకటించారు.
కొత్త సెయింట్లుగా వీరిని రోమన్ కేథలిక్ మతపెద్దల ప్రతినిధి బృందం ప్రతిపాదించగా, పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన చేశారు. ‘‘నిరుపేదలకు, అట్టడుగువారికి సేవ చేయడం ఎలాగో కొత్త సెయింట్లు ఆచరించి చూపారు’’ అని పోప్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అనంతరం లాటిన్ భక్తిగీతాలతో సెయింట్ పీటర్స్ స్క్వేర్ మారుమోగింది. ఫాదర్ చవర, సిస్టర్ యూఫ్రేసియాల కటౌట్లతో భక్తులు సందడి చేశారు.
సెయింట్‌హుడ్ ప్రకటన కార్యక్రమాన్ని చూసేందుకు కేరళ నుంచి వెళ్లిన క్రైస్తవ మతపెద్దలు, భక్తులతో కూడిన 5 వేల మంది బృందం, కేంద్రం తరఫున వెళ్లిన అధికారిక బృందం సభ్యులు కార్యక్రమంలో ఉల్లాసంగా పాల్గొన్నారు. కేరళ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో క్రైస్తవులు టీవీల్లో కార్యక్రమాన్ని వీక్షించి సంబరాలు చేసుకున్నారు. కేరళలో రోమన్ కేథలిక్కులు ఉదయం నుంచీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.