
పేలుడులో గాయపడిన అనుమానిత ఉగ్రవాది
న్యూయార్క్: అమెరికా నగరం న్యూయార్క్‌లోని రద్దీగా ఉండే ఓ మెట్రో స్టేషన్‌లో ఐసిస్ ఉగ్రవాది సోమవారం పేలుడుకు పాల్పడ్డాడు. అదృష్టవ శాత్తూ బాంబు పాక్షికంగానే పేలడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడగా వారి ప్రాణాలకేమీ అపాయం లేదని పోలీసులు తెలిపారు. న్యూయా ర్క్‌లోని మన్‌హటన్ ప్రాంతంలో ఉండే ‘పోర్ట్ అథారిటీ’ బస్ టర్మినల్ ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడే మెట్రో స్టేషన్ కూడా ఉంది.
బంగ్లాదేశ్‌కు చెందిన అకాయెద్ ఉల్లా (27) అనే ఐసిస్ ఉగ్రవాది ఇంట్లోనే పైప్ బాంబు తయారుచేసుకుని వచ్చి ఉదయం 7.15 గంటల ప్రాంతంలో పోర్ట్ అథారిటీలో పేలుడుకు పాల్పడ్డాడు. బాంబు పాక్షికంగా పేలడంతో ఉగ్రవాదికి కూడా గాయాలయ్యాయి. అతణ్ని అరెస్టు చేసిన పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌కు ఈ ఘటన గురించి సమాచారం అందించారు. పేలుడు వల్ల మెట్రో స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. అమెరికాలోని వివిధ నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment