వాషింగ్టన్: సూర్యరశ్మిని, మురికినీటిని ఉపయోగించుకుని హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేయగలిగే పరికరాన్ని కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. సుస్థిర ఇంధన వనరును అందించడమే కాకుండా మురికినీటి శుద్ధికీ ఇది దోహదపడుతుందని వెల్లడించారు. ఈ పరికరంలో సూక్ష్మజీవులతో కూడిన ‘మైక్రోబియల్ ఫ్యూయెల్ సెల్ (ఎంఎఫ్‌సీ)’, ‘ఫొటోఎలక్ట్రోకెమికల్ సెల్ (పీఈసీ)’ ఉంటాయి. మురికినీటిలోని కర్బనపదార్థాలను ఎంఎఫ్‌సీలోని బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేసి కొంత విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.
ఆ విద్యుత్ పీఈసీ భాగానికి చేరి అక్కడ నీటి ఎలక్ట్రోలైసిస్ జరిగి హైడ్రోజన్, ఆక్సిజన్ ఏర్పడతాయి. ఎంఎఫ్‌సీ, పీఈసీలను రెండింటినీ ఒకేసారి లేదా ఒక్కోదానిని ఒక్కోసారి ఉపయోగించి కూడా హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.