ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే రీచార్జబుల్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ విమానాల తయారీకి కొన్ని కంపెనీలు ప్రయత్నాలు సాగిస్తుంటే, స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక కంపెనీ ఏకంగా లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనంతో ఎగిరే విమానానికి రూపకల్పన చేసింది.
‘ఈవీటాల్’ పేరుతో రూపొందించిన ఈ బుల్లి విమానం పూర్తిగా ద్రవరూపంలో ఉన్న హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగించుకుని పనిచేస్తుంది. ఇందులో పైలట్‌తో పాటు మరో నలుగురు ప్రయాణికులు ప్రయాణించడానికి వీలవుతుంది. తక్కువ దూరంలోని విమాన ప్రయాణాలకు అనుగుణంగా సైరస్‌జెట్ అనే స్విస్ కంపెనీ దీనిని రూపొందించింది.
ఇందులో ఒకసారి పూర్తిగా ఇంధనం నింపితే, 1850 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. దీని గరిష్ఠవేగం గంటకు 520 కిలోమీటర్లు. ఈ విమానానికి పొడవాటి రన్‌వే కూడా అవసరం లేదు. హెలికాప్టర్ మాదిరిగా ఇది నిలువునా టేకాఫ్ చేసుకుని, ఆకాశంలోకి ఎగిరిపోగలదు. ఈ విమాన సేవలను త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు సైరస్‌జెట్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కారు..
ఇప్పటికే లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ కార్లు బాగా వినియోగంలోకి వచ్చాయి. తాజాగా జపానీస్ కార్ల తయారీ కంపెనీ హోండా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో పనిచేసే కారును రూపొందించింది.
హోండా ‘సీఆర్–వీ ఈ:ఎఫ్‌సీఈవీ’ పేరుతో రూపొందించిన ఈ కారు నిరంతారయంగా 430 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. జనరల్ మోటార్స్ సహకారంతో హోండా కంపెనీ ఈ కారులో ఉపయోగించే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌ను రూపొందించింది. 92.2 కిలోవాట్ల సామర్థ్యం గల ఈ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్ నుంచి ఇంజిన్‌కు 174 హార్స్ పవర్ విద్యుత్తు సరఫరా అవుతుంది.
ఇందులో తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే సహా పలు అధునాతన సాంకేతిక ఏర్పాట్లు చేయడం విశేషం. హోండా కంపెనీ వచ్చే ఏడాది దీనిని మార్కెట్‌లోకి విడుదల చేయాలని భావిస్తోంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.
ఇవి చదవండి: ఆశ్చర్యపోయాను!.. భారతీయ విద్యార్థిపై 'టిమ్ కుక్' ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment