అమెరికా ఆస్పత్రిలో ‘సూపర్‌బగ్’
హాలీవుడ్ సెలబ్రిటీల చికిత్సకు పేరుపొందిన సెడార్-సినాయ్ మెడికల్ సెంటర్‌లో చికిత్సకు లొంగని ‘సూపర్‌బగ్’ పట్ల గురువారం నాడు అప్రమత్తత ప్రకటించారు. వైద్య పరిభాషలో ‘కార్బాపీనెమ్-రెసిస్టెంట్ ఎంటరోబ్యాక్టీరియాసియా బ్యాక్టీరియా (సీఆర్‌ఈ)గా వ్యవహరించే ఈ సూపర్‌బగ్ నలుగురు రోగులకు సోకినట్టు నిర్ధారించామని ఆస్ప్రత్రి వర్గాలు తెలిపాయి. మరో 70 మందికి సోకే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలే తెలియజేస్తున్నాయి.
గత నెలలోనే నగరంలోని రొనాల్డ్ రీగన్ ఉక్టా మెడికల్ సెంటర్‌లో ఇదే సూపర్‌బగ్‌తో వచ్చే వ్యాధి కారణంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. క్లోమగ్రంధి, పైత్యరస నాళం జబ్బుల శస్త్ర చికిత్సకు ఉపయోగించే వైద్య పరికరాల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుందని తేలడంతో రోనాల్డ్ రీగన్ మెడికల్ సెంటర్‌పై గగ్గోలు రేగింది. సూపర్‌బగ్ వ్యాప్తికి కారణమవుతున్న వైద్య పరికరాలతో తమ ఆస్ప్రత్రిలో దాదాపు 70 మందికి చికిత్సలు చేశామని ఇప్పుడు వారందరినీ వెనక్కి పిలిపించి పరీక్షలు నిర్వహించనున్నామని ఆస్పత్రి వర్గాలు వివరించాయి.