భర్త మరణించిన బాలింతకు.. సుష్మా ఆపన్నహస్తం
ఒకవైపు గుండెపోటుతో భర్త చనిపోయి పుట్టెడు దుఃఖం.. మరోవైపు కూతురు పుట్టిన ఆనందం.. ఇంకోవైపు.. తిరిగి భారతదేశానికి ఎలా రావాలో తెలియక ఆందోళన. ఇలాంటి కష్టాల్లో ఉన్న భారతీయ మహిళను ఆదుకోడానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ముందుకొచ్చారు. అమెరికాలో ఉంటున్న దీపికా పాండే భర్త హరిఓం పాండే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. ఆయన బోస్టన్‌లో అక్టోబర్ 19వ తేదీన గుండెపోటుతో మరణించారు. అప్పటికే నెలలు నిండిన ఆమెను, నాలుగేళ్ల కొడుకును కుటుంబ స్నేహితులు మెరుగైన వైద్యసేవల కోసం న్యూజెర్సీకి తీసుకెళ్లారు.
అక్కడి ఆస్పత్రిలో ఆమెకు కూతురు పుట్టింది. ఉత్తరప్రదేశ్‌లో ఉండే తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలంటే పుట్టిన బిడ్డకు తండ్రి జీవించి లేరు కాబట్టి పాస్‌పోర్టు రావడం కష్టం. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ బీజేపీ శాఖ సుష్మాస్వరాజ్‌కు ట్విట్టర్ ద్వారా వివరించింది. దాంతో వెంటనే స్పందించిన సుష్మా.. కష్టకాలంలో ఉన్న దీపికకు వీలైన అన్ని రకాలుగా తాను సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి ఈ మేరకు సమాచారం ఇచ్చామన్నారు. దీపికకు బోస్టన్‌లో ఇన్సూరెన్స్ ఉన్నా, అది న్యూజెర్సీలో చెల్లుబాటు కాదు కాబట్టి అక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ సదుపాయం కలిగించాలని కూడా దీపిక కుటుంబ సభ్యులు సుష్మాస్వరాజ్‌ను కోరారు. పుట్టిన బిడ్డకు వీలైనంత త్వరగా పాస్‌పోర్టు ఇప్పిస్తే, తమ కూతురిని, మనవడిని, మనవరాలిని సొంత దేశానికి రప్పించుకుంటామన్నారు. అలాగే పుట్టిన బిడ్డకు ఓవర్సీస్ ఇండియన్ కార్డు కూడా కావాలని, ఇవన్నీ ఉంటే తప్ప భారతదేశంలోకి ఆ బిడ్డ అడుగుపెట్టడానికి వీలుండదని తెలిపారు.