సౌదీ రాజు హత్యకు కుట్ర
సౌదీ రాజు హత్యకు కుట్ర
Published Wed, Mar 8 2017 10:27 AM | Last Updated on Mon, Aug 20 2018 7:34 PM
అబుదాబి: సౌదీ అరేబియా రాజు హత్యకు కుట్ర జరిగినట్లు మలేసియా పోలీసులు తెలిపారు. గత వారం కింగ్ సల్మాన్ కౌలాలంపూర్‌లో పర్యటించారు. ఈ సమయంలో సల్మాన్‌ను హత్య చేసేందుకు మిలిటెంట్లు కుట్ర పన్నినట్లు చెప్పారు. మొత్తం నలుగురు మిలిటెంట్లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీరందరూ యెమన్‌లోని హౌతీ రెబెల్ గ్రూప్‌కు చెందిన వారిగా తెలిసింది.
కౌలాలంపూర్ నగర శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని పత్రాలు పరిశీలించగా.. అవన్నీ నకిలీవని తేలినట్లు పోలీసులు చెప్పారు. డ్రగ్స్ రవాణాతో కూడా వీరికి సంబంధాలున్నాయని తెలిపారు. విచారణలో సౌదీ రాజు సల్మాన్‌పై దాడి చేసేందుకు కుట్ర పన్నినట్లు వెల్లడించారని ఐజీ ఖలీద్ అబూబకర్ వెల్లడించారు. నలుగురి వద్ద నుంచి 60 వేల యూఎస్ డాలర్లను స్వాధీనం చేసున్నట్లు తెలిపారు.
హౌతీ రెబెల్ గ్రూప్ అరెస్టుకు ముందు ట్రక్కు బాంబు దాడిని ప్లాన్ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కింగ్ సల్మానే లక్ష్యంగా వీరు కూడా దాడికి కుట్రపన్నినట్లు అబూబకర్ చెప్పారు.
Advertisement