
మన జీవితాల్లో వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. దేహశుభ్రత గురించి పట్టించుకోకుంటే సంబంధాలు దెబ్బతినే అవకాశముంది. తైవాన్‌లో వెలుగుచూసిన ఉదంతమే దీనికి తాజా రుజువు. తైపీ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం.. తన భార్య మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ తైవాన్ పౌరుడొకరు విడాకుల కోసం కోర్టుకెక్కాడు. భార్య నుంచి విడిపోవడానికి అతడు చెప్పిన కారణాలు విని న్యాయమూర్తులు అవాక్కయ్యారు.
తన భార్య ఏడాదికి ఒకసారి మాత్రమే స్నానం చేస్తుందని చెప్పి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అంతేకాదు ఉదయాన్నే పళ్లు తోముకోదని, శిరోజాలను కూడా శుభ్రంగా ఉంచుకోదని తెలిపాడు. తాము ప్రేమించుకునేటప్పడు వారానికి ఒకసారి స్నానం చేసేదని, పెళ్లైన తర్వాత పరిస్థితి దారుణంగా మారిందన్నాడు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్నానమాడేదని, దీని కోసం 6 గంటల సమయం తీసుకునేదని వివరించాడు.
ఉద్యోగం చేయొద్దని ఆమె పెట్టే బాధ భరించలేక కొన్నాళ్లు జాబ్ మానేసి, అత్తారింట్లో ఉన్నానని చెప్పాడు. 2015 చివర్లో తన భార్యకు చెప్పకుండా ఇళ్లు విడిచి వెళ్లిపోయి సించు అనే ప్రాంతంలో ఉద్యోగంలో చేరానని తెలిపాడు. అయితే నెల రోజుల తర్వాత తన ఆచూకీ తెలుసుకుని వచ్చిన ఆమె ఉద్యోగం మానేయాలని మళ్లీ ఒత్తిడి చేయడంతో భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానన్నాడు. తనపై భర్త చేసిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చింది. అతడిని తన తల్లిదండ్రులు సొంత కొడుకులా చూసుకున్నారని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment